ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొన్న బండి సంజయ్.. నిన్న రేవంత్.. నేడు పాడి కౌశిక్.. తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 07:34 PM

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఘాటు విమర్శలతో పాటు సంచలన ఆరోపణలు కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. జోరుగా సవాళ్ల పర్వం నడుస్తోంది. అయితే.. రాజకీయ నేతలన్నాక ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవటం సర్వసాధారణమే. ఆ సవాళ్లు స్వీకరించేది లేదు.. నిరూపణ అయ్యేది లేదు అని కొట్టిపాడేయకండి. ప్రస్తుతం.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రత్యర్థులపై సవాళ్లు చేయటమే కాదు.. వాటిని స్వీకరిస్తున్నారు కూడా. అందులోనూ.. దేవుళ్ల సాక్షిగా ప్రమాణాలు చేసి నిజాయితీ నిరూపించుకోవాలన్న సవాళ్లు ఎక్కువగా వినిపిస్తుండగా.. వాటిని స్వీకరిస్తున్న నేతలు తడిబట్టలతో దైవం సాక్షిగా ప్రమాణాలు చేయటం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఈ లిస్టులో ఇప్పటికే... బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఉండగా.. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా చేరారు.


రామగుండం ఎన్టీపీసీ ఫ్లైయాష్‌ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్లైయాష్‌ అక్రమ రవాణాతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ రూ. వంద కోట్లు దండుకున్నారంటూ పాడి కౌశిక్‌ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన పొన్నం.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పాడి కౌశిక్‌ రెడ్డికి లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ నోటీసులను కోర్టులోనే ఎదుర్కొంటానని చెప్పిన కౌశిక్‌ రెడ్డి.. తనకు ఫ్లైయాష్‌ అక్రమ రవాణాతో సంబంధం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు.


ఈ సవాల్‌ మీద స్పందించిన హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జి వొడితెల ప్రణవ్‌ స్పందించారు. మంత్రి ప్రమాణం చేయడం కాదు.. ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డే హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌ హన్మంతుడి ఆలయం వద్దకు వచ్చి.. తాను అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలని ప్రతిసవాల్‌ విసిరారు. ఆ సవాల్‌‌ను స్వీకరించిన ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి మంగళవారం ఉదయం చెల్పూర్‌ హన్మంతుడి ఆలయానికి బయల్దేరగా.. పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అటు కాంగ్రెస్‌ నేత ప్రణవ్‌‌ను కూడా సింగాపురంలో నిర్బంధించారు.


తడిబట్టలతో పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణం..


పోలీసులు తనను బయటకు రానివ్వకపోవడంతోనే ఇంట్లోని హన్మంతుడి ఫొటో ఎదుట.. తడి బట్టలతో కౌశిక్‌ రెడ్డి ప్రమాణం చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ హన్మంతుడి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలోనే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ తన నిజాయితీ నిరూపించుకునేందుకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని.. కౌశిక్ రెడ్డి సవాల్‌ విసిరారు.


తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం..


ఇదిలా ఉంటే.. గతంలో బండి సంజయ్ కూడా.. యాదాద్రి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారగా.. సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రం చేసిందంటూ గులాబీ నేతలు ఆరోపించారు. అయితే.. ఈ వ్యవహారంలో బీజేపీ నేతల ప్రమేయం లేదని.. యాదాద్రికి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లి.. తడిబట్టలతో గర్భగుడి ముందు నిల్చొడి బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రమాణం చేశారు. కాగా.. కేసీఆర్ కూడా యాదాద్రిలో ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ విసరగా.. దాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం.


రేవంత్ రెడ్డి కంట'తడి' ప్రమాణం..


ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి.. కంట'తడి' పెట్టుకుని ప్రమాణం చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో కేసీఆర్ నుంచి కాంగ్రెస్ ముడుపులు తీసుకుందంటూ మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపణలు చేయగా.. వాటిపై స్పందించిన రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈటల రాజేందర్ తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేశారని.. ఏ ఆధారం లేని వారికి దేవుడే ఆధారమని.. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణం చేసినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అమ్మవారి సాక్షిగా.. మునుగోడు ఉపఎన్నికల్లో కేసీఆర్ నుంచి తాము ఒక్క రూపాయి తీసుకున్నా.. సర్వనాశనం అయిపోతామంటూ కంటతడి పెట్టుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com