ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైట్‌ వాచ్‌మన్‌ ఐఐఎం ప్రొఫెసర్‌ అయ్యాడిలా

national |  Suryaa Desk  | Published : Sat, Sep 25, 2021, 03:58 PM

నిరుపేద కుటుంబం. ఊరి చివర ఓ పూరి గుడిసెలో నివాసం, చదువుకోవాలన్న తపన, కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి. అయితే ఇవేవీ తన ఎదుగుదలకు ప్రతిబంధకాలుగా భావించలేదు రంజిత్‌ రామచంద్రన్‌. పగలు కళాశాలకు వెళుతూ రాత్రిళ్లు నైట్‌వాచ్‌మన్‌గా పని చేశాడు. నేడు రాంచీలోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ (ఐఐఎం)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అయ్యి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. రంజిత్‌ రామచంద్రన్‌ ఇటీవల తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. అందులో వర్షపు నీళ్లు లోపలికి రాకుండా టార్పాలిన్‌ కప్పిన గుడిసె, దాని పక్కన తన ఫొటో! ‘ఇక్కడ ఒక ఐఐఎం ప్రొఫెసర్‌ పుట్టాడు’... అంటూ ట్యాగ్‌ చేశాడు. అది మొదలు వేలకు వేల లైక్‌లు, షేర్లతో సామాజిక మాధ్యమాలన్నింటా 28 సంవత్సరాల రంజిత్‌ పేరు మారుమోగిపోతోంది. స్ఫూర్తివంతమైన అతడి జీవితాన్ని చదివి యువత జేజేలు కొడుతోంది. ప్రతికూల పరిస్థితుల్లో పెరిగి, ఆకలిని దిగమింగి, సవాళ్లను నిచ్చెనలుగా చేసుకున్నాడు. సౌకర్యాల లేమిని కారణంగా చూపించకుండా తన పరిస్థితికి చింతిస్తూ కూర్చోకుండా లక్ష్యానికి గురి పెట్టాడు. అదే నేడు అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది.


కేరళలోని కాసరగోడ్‌ జిల్లాలో చిన్న ఊరు పనతూర్‌. డిగ్రీ (ఎకనామిక్స్‌) చదివేందుకు అక్కడి కళాశాలలో చేరాడు రంజిత్‌ రామచంద్రన్‌. ‘‘మాది పేద కుటుంబం. రెండు పూటలా తినడానికే కష్టపడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మానాన్న నా చదువుకయ్యే డబ్బు ఎక్కడి నుంచి తేగలుగుతారు! అందుకే నా ఖర్చుల కోసం వారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పనతూర్‌లోని బీఎ్‌సఎన్‌ఎల్‌ ఎక్సేంజ్‌లో నైట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కుదిరాను. పగలు కాలేజీకి వెళ్లేవాడిని. సాయంత్రం ఇంటికి రాగానే కాస్తంత తిని... రాత్రి వాచ్‌మన్‌గా పనిచేసేవాడిని’’ అంటున్న రంజిత్‌ ఉద్యోగాన్ని చదువుకు ఆటంకంగా భావించలేదు. నైట్‌ వాచ్‌మన్‌గా రంజిత్‌కు వచ్చేది కొద్ది మొత్తమే. అయితే అందులోనే సర్దుకుపోతూ, కొంత మొత్తం దాచుకుని చదువు కోసం వినియోగించాడు. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తలవంచక డిగ్రీ ఆనర్స్‌ పూర్తి చేశాడు. ఆ తరువాత పీహెచ్‌డీ కోసం ఓ యూనివర్సిటీకి వెళ్లాడు. అయితే మలయాళం తప్ప మరే భాషా రాకపోవడంతో అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో పీహెచ్‌డీ ఇక తనవల్ల కాదనే నిర్ణయానికి వచ్చాడు. వదిలేద్దామనుకున్నాడు. కానీ అతని గైడ్‌ డాక్టర్‌ సుభాష్‌ అందుకు అంగీకరించలేదు. రంజిత్‌లో ధైర్యం నూరిపోశారు. ప్రోత్సహించారు. ‘‘ఆయన మాటలు నాకు స్ఫూర్తి మంత్రంలా పనిచేశాయి. ఏది ఏమైనా సరే... ఎన్ని ఇబ్బందులెదురైనా సరే... వెనక్కి తిరిగి పోకూడదనుకున్నాను. పోరాడి నా కలను సాధించాలనే సంకల్పంతో ముందడుగు వేశా’’ అంటూ చెప్పుకొచ్చాడు రంజిత్‌.


అనుకున్నట్టుగానే రంజిత్‌ రామచంద్రన్‌ గత ఏడాది పీహెచ్‌డీ పూర్తి చేశాడు. డాక్టరేట్‌ పట్డా పొందాడు. రెండు నెలల పాటు బెంగళూరులోని ‘క్రిస్ట్‌ యూనివర్సిటీ’లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ఆ తరువాత ఐఐఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్ట్‌ సాధించి... ఎన్నో ఏళ్ల తన కలను నిజం చేసుకున్నాడు. ఆ క్షణం భావోద్వేగంతో అతడి కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఈ ఆనంద క్షణాలను అందరితో పంచుకోవాలనుకుని తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశాడు. దృఢ సంకల్పం ఉంటే ఎంతటి లక్ష్యాన్నయినా సాధించవచ్చనడానికి ప్రత్యక్ష ఉదాహరణ రంజిత్‌ రామచంద్రన్‌. అతడి తండ్రి చిన్నపాటి టైలర్‌. తల్లి రోజు కూలీ. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో రంజిత్‌ మధ్యలోనే బడి మానేయాల్సి వచ్చింది. అయితే ఫలానా పని చేయమని తల్లితండ్రులు ఏనాడూ అతడిని బలవంతపెట్టలేదు. అలాగని ఏ దారిలో వెళ్లాలో, ఏం చేయాలో చెప్పే మార్గదర్శులు కూడా ఎవరూ లేరు. ‘‘అలాంటి నాకు సెయింట్‌ పియోస్‌ కాలేజీ... వేదికపై ఎలా మాట్లాడాలో నేర్పింది. ‘కేరళ సెంట్రల్‌ యూనివర్సిటీ’ కాసరగోడ్‌ వెలుపల ఉన్న ప్రపంచపు ద్వారాలు తెరిచింది’’ అంటాడు ఈ యువ ప్రతిభావంతుడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com