ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే ఇండో-పాక్‌ మ్యాచ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 04, 2017, 08:23 AM

ఇండో-పాక్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూసిన సమయం రానేవచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత, పాకిస్థాన ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అయ్యాయి. దాయాదుల సమరానికి మరికొన్ని గంటల్లోనే తెరలేవనుంది. చాంపియన్స ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే గ్రూప్‌-బి మ్యాచలో డిఫెండింగ్‌ చాంపియన భారతతో దాయాది పాకిస్థాన తలపడనుంది. ఈ మెగా టోర్నీలో ఇద్దరికీ ఇదే తొలి మ్యాచ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ శుభారంభం చేయాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. అయితే మైదానం వెలుపల విషయాలు పక్కనబెడితే అన్ని విభాగాల్లోనూ శత్రు దుర్భేధ్యంగా కనిపిస్తున్న కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఈ మ్యాచలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పైగా ఐసీసీ ఈవెంట్లలో పాక్‌పై మెరుగైన రికార్డు ఉండడంతో భారత రెట్టించిన ఉత్సాహంతో గర్జింజేందుకు సిద్ధమైంది. 2012 టీ20 ప్రపంచకప్‌ నుంచి 2016 టీ20 ప్రపంచకప్‌ వరకూ జరిగిన ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లూ ఐదు మ్యాచల్లో తలపడితే అన్నింట్లోనూ టీమిండియానే ఏకపక్ష విజయాలు సాధించడం కోహ్లీ సేనలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. దీంతో ఈ మ్యాచలోనూ నెగ్గి తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని భారత భావిస్తోంది. అయితే 2009 చాంపియన్స ట్రోఫీలో భారతపై విజయం సాధించడం ఒక్కటే పాక్‌కు ఊరట కలిగించే అంశం. ఇక ఈ మ్యాచ్‌లో నెగ్గి భారతపై రికార్డును మెరుగుపర్చుకోవాలని సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ నేతృత్వంలోని పాక్‌ భావిస్తోంది.


 


కోహ్లీపైనే అంచనాలు..: ఈ మ్యాచ్‌లో మిగతావారి సంగతెలా ఉన్నా.. అందరి దృష్టి మాత్రం విరాట్‌ కోహ్లీపైనే. ఎందుకంటే పాకిస్థాన్‌పై ఆడిన 10 వన్డేల్లో విరాట్‌ రెండు సెంచరీలు సాధించాడు. పాక్‌పై అతనికి మెరుగైన రికార్డు ఉంది. అలాగే ఇంగ్లండ్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో అతడు ఒక సెంచరీ సహా 38.54 సగటుతో రన్స్‌ చేశాడు. ఇది అద్భుతమైన రికార్డేమీ కాకపోయినా.. విరాట్‌ క్రీజులో నిలదొక్కుకుంటే అలవోకగా భారీ ఇన్నింగ్స్‌ ఆడేయగలడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఓపెనర్లు రోహిత శర్మ, శిఖర్‌ ధవన్‌తోపాటు సీనియర్లు యువరాజ్‌, ధోనీతో కూడిన భారత బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. రోహిత ఆట ఆందోళన కలిగిస్తున్నా.. ధవన్‌ ఫామ్‌లో ఉండడం భారతకు కలిసొచ్చే అంశం. పైగా గత చాంపియన్స్‌ ట్రోఫీలో అదరగొట్టిన అతనికి ఇంగ్లండ్‌లో మెరుగైన రికార్డు ఉంది. యువీ, మహీ అనుభవం తప్పకుండా జట్టుకు ప్లస్‌ పాయింటే. హార్దిక్‌ పాండ్యా రూపంలో సీమింగ్‌ ఆల్‌రౌండర్‌ జట్టులో ఉండడం కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్‌ విభాగానికొస్తే టీమిండియా పేస్‌ దళం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది. ఐపీఎల్‌తో సూపర్‌ ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేష్‌ యాదవ్‌ తమ పేస్‌తో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమితోపాటు డెత ఓవర్ల స్పెషలి్‌స్టగా ముద్ర పడిన జస్‌ప్రీత బుమ్రా ఉండనే ఉన్నాడు. ఇంగ్లండ్‌ పరిస్థితులు పేస్‌కు సహకరిస్తాయి కాబట్టి.. భారత నలుగురు పేసర్లతో బరిలోకి దిగొచ్చు. అదే జరిగితే అశ్విన్‌, జడేజాలో ఒకరు బెంచ్‌కే పరిమితం కావొచ్చు.


 


బౌలింగ్‌ బలంతో పాక్‌..


ఈ మ్యాచ్‌లో భారతకు పాక్‌ పోటీనిచ్చే అంశం ఏదైనా ఉందంటే అది బౌలింగే. మహ్మద్‌ ఆమెర్‌, హసన్‌ అలీ, వాహబ్‌ రియాజ్‌, జునైద్‌ ఖాన్‌తో కూడిన పాక్‌ పేస్‌ విభాగం దుర్భేధ్యంగా ఉంది. లెఫ్టార్మ్‌ పేసర్లయిన ఆమెర్‌, వాహబ్‌, జునైద్‌ చెలరేగితే ఎంతటి బ్యాట్స్‌మెన్‌ అయినా నేల చూపులు చూడాల్సిందే. ఇక ఇమాద్‌ వసీం రూపంలో చక్కటి ఆల్‌రౌండర్‌ జట్టులో ఉన్నాడు. అయితే బ్యాటింగ్‌ విభాగంపైనే పాక్‌ ఆందోళనగా ఉంది. ఇటీవలి కాలంలో ఫామ్‌లేక తంటాలు పడుతున్న అజర్‌ అలీ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. ఓపెనర్‌ అహ్మద్‌ షెహజాద్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడి చాలా కాలమైంది. దీంతో యువ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఆజమ్‌పై పాక్‌ భారీగానే ఆశలు పెట్టుకుంది. మిడిలార్డర్‌లో హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌తోపాటు కెప్టెన్‌ సర్ఫ్‌రాజ్‌ అనుభవం జట్టుకు అక్కరకొస్తుంది. యువ లెగ్‌స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ను సైతం పక్కనబెట్టి.. ఫహీమ్‌ ఆష్రాఫ్‌ అదనపు బ్యాట్స్‌మన్‌గా ఆడించాలని పాక్‌ భావిస్తోంది.


బౌలర్ల ఎంపికే సమస్య!


కోచ్‌ అనిల్‌ కుంబ్లేకు నాకు మధ్య విభేదాలు ఉన్నట్టు అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఏవేవో రాసేశారు. కానీ.. అవన్నీ నిజం కాదు. కొన్ని అభిప్రాయాలను ఆమోదించడం కొన్నింటిని విభేదించడం సహజమే. మా జర్నీ అంతా సాఫీగానే సాగుతోంది. దయచేసి ఇలాంటి పుకార్లు సృష్టించొద్దు. ఇక పాక్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. సరైన బౌలింగ్‌ కాంబినేషన్‌ను ఎంచుకోవడమే మా ముందున్న అతిపెద్ద సవాల్‌. వామప్‌ గేమ్‌ల్లో అందరూ బాగా బౌలింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపిక కష్టమే ఇక పాక్‌తో పోరు మాకు ఇతర మ్యాచ్‌లాంటిదే.


- విరాట్‌ కోహ్లీ


మా ప్రణాళికలు మాకున్నాయి


కోహ్లీ గొప్ప ఆటగాడే.. అందులో సందేహం లేదు. కానీ.. అతని కోసం మా ప్రణాళికలు మాకున్నాయి. అతన్ని వీలైనంత త్వరగా అవుట్‌ చేస్తే మిగిలిన వారిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక భారత బౌలింగ్‌ విభాగం బలోపేతంగా ఉంది. అయి తే వారిని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇక భారతతో మ్యాచ్‌ అంటేనే ఎంతో ప్రతిష్ఠాత్మకం. అందుకే బయట ఏం జరుగుతుందనేది పట్టించుకోవద్దని సహచరులకు చెప్పా. ఈ మ్యాచ్‌పైనే దృష్టిపెట్టాలని సూచించా.


- సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com