ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయలలిత బంగారం తిరిగి ఇచ్చేస్తాం, 6 పెద్ద ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి.. ఎన్ని కిలోలు ఉన్నాయంటే

national |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 10:12 PM

దివంగత తమిళనాడు మాజీ సీఎం, సినీ నటి, పురుచ్చితలైవి జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జయలలితకు సంబంధించిన బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రక్రియను ప్రారంభించింది. అక్రమాస్తుల కేసులో 10 ఏళ్ల క్రితం జయలలితను దోషిగా తేల్చిన కోర్టు ఆమెకు భారీగా జరిమానాతోపాటు జైలు శిక్షను కూడా విధించింది. ఈ క్రమంలోనే ఆమె చనిపోవడంతో జయలలిత వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఆభరణాలతోపాటు, ఇతర ఖరీదైన వస్తువులు, స్థిర, చర ఆస్తులను వేలం వేయడం లేదా అమ్మడం ద్వారా జరిమానాను రాబట్టుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జయలలిత బంగారం తీసుకెళ్లేందుకు తమిళనాడు ప్రభుత్వం రావాలని బెంగళూరు కోర్టు తాజాగా పేర్కొంది.


బెంగళూరులోని 36 వ సిటీ సివిల్ కోర్టు.. అక్రమాస్తుల కేసులో 2014 లో అప్పటి తమిళనాడు సీఎం జయలలితను దోషిగా తేల్చింది. ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే 2016 లో జయలలిత మరణించగా.. ఏడేళ్ల తర్వాత తాజాగా కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. జయలలితకు చెందిన 27 కిలోల బంగారం, వెండి, ఇతర వజ్రాభరణాలను వచ్చే నెల 6, 7 వ తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేయడమే ప్రత్యేక కోర్టు విచారణలో ఉంది. ప్రస్తుతం ఆమె ఆభరణాలను వేలం వేసిన తర్వాత జయలలిత స్థిరాస్తులను వేలంలోకి తీసుకురానుంది.


మొత్తం 27 కిలోల నగలలో 20 కిలోల నగలను అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా జరిమానా వసూలు చేయనున్నారు. మిగిలిన 7 కిలోలు జయలలిత తల్లి నుంచి వారసత్వంగా వచ్చినవిగా భావించి వాటిని వేలం వేయకుండా మినహాయింపు కల్పించారు. ఇక కాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో జయలలితకు ఉన్న అకౌంట్ నుంచి సోమవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు దాదాపు రూ.60 లక్షలు అందాయి.


ఇక జయలలిత బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని కూడా నియమించినట్లు కోర్టు తెలిపింది. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించింది. కోర్టు నుంచి ఆభరణాలను తీసుకునే సమయంలో ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్‌తోపాటు 6 భారీ ట్రంకు పెట్టెలు, భారీ సెక్యూరిటీతో రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే కేసులో తమిళనాడు ప్రభుత్వం.. కర్ణాటకకు లిటిగేషన్‌ ఫీజుగా రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.


దివంగత తమిళనాడు సీఎం జయలలిత అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో విచారణ జరిపిన కోర్టు.. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి అధికారులు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె దోషిగా తేలడంతో 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించడంతో తాజాగా ఆ కేసును మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది.


అక్రమార్జన కేసులో 1996 లో చెన్నైలోని జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలతోపాటు పలు వస్తువులు ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. అందులో 7 కిలోల బంగారం, వజ్రాలు, 700 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వీటితోపాటు 740 ఖరీదైన చెప్పులు.. 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీలు, 8 వీసీఆర్‌లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్స్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.2 లక్షల నగదుతోపాటు పలు వస్తువులు ఉన్నాయి.


2014 సెప్టెంబర్‌లో జయలలిత అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన స్పెషల్ కోర్టు.. జయలలితతోపాటు ఆమె నెచ్చెలి శశికల, జే ఇలవరసి, వీఎన్ సుధాకరణ్‌లను దోషులుగా తేలుస్తూ.. 1136 పేజీల తీర్పున వెలువరించింది. దీంతో అందరికీ 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జయలలితకు రూ.100 కోట్ల జరిమానా.. మిగిలిన ముగ్గురికీ ఒక్కొక్కరికీ రూ.10 కోట్ల చొప్పున భారీ జరిమానా విధించింది. అయితే కర్ణాటక హైకోర్టు వీరందరినీ 2015 మే 11 వ తేదీన నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాత 2017 ఫిబ్రవరి 14 వ తేదీన స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పున సమర్థించిన సుప్రీంకోర్టు వారిని దోషులుగా తేల్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com