ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. 110 మంది సజీవదహనం

international |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 09:37 PM

ఇరాక్‌‌లో పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం తాలూకు వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. గత మంగళవారం చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదంలో 110 మంది మృతి చెందారు. మరో 150 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వరుడు రేవాన్ (27), వధువు హనీన్ (18) తృటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ, అత్యంత దురదృష్టవంతులైన జంటగా మిగిలారు. రేవాన్ కుటుంబంలో 15 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. వధువు హనీన్‌కైతే విషాదంతో నోట నుంచి మాటలు రావట్లేదు. ఈ ప్రమాదంలో ఆమె 10 మంది కుటుంబసభ్యులను కోల్పోయింది. తల్లి, సోదరుడు సజీవదహనమయ్యారు. తీవ్రమైన కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తండ్రి పరిస్థితి విషమంగా ఉంది.


వైరల్ అవుతున్న వీడియో ప్రారంభంలో వధూవరులు హృద్యమైన సంగీతానికి రొమాంటిక్‌గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఇంతలో బాంకెట్ హాల్ (పెళ్లి మండపం) సీలింగ్ నుంచి అగ్నికీలలు కిందకు పడుతుండటం కనిపిస్తాయి. పెళ్లి వేడుకలో ఉన్న వారంతా హాహాకారాలు చేస్తూ ప్రాణ భయంలో అటూ ఇటూ పరుగులు పెట్టారు. తమ చిన్నారులను వెతికుతూ కొంత మంది ఆందోళనకు గురయ్యారు. పిల్లలను ఎత్తుకొని బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. సీలింగ్ భాగం నుంచి మంటలతో మండుతూ శిథిలాలు వారి మీద పడ్డాయి.


ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇరాక్‌‌లోని మోసుల్ నగర శివార్లలో ఉన్న అల్-హమ్దానియాలో బ్యాంకెట్ హాల్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదం తీవ్రతకు హాల్ మొత్తం శిథిలమైంది. పైకప్పు, గోడలు కూలిపోయాయి. ఫైర్ క్రాకర్స్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే, సీలింగ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని ప్రత్యక్షసాక్షులు కొంత మంది చెబుతున్నారు. కొంత జంట డాన్స్ చేస్తున్న సమయంలో నిషేధిత క్రాకర్స్ కాల్చారని.. అదే ప్రమాదానికి కారణమైందని ఎక్కువ మంది చెబుతున్నారు.


ఈ స్థాయిలో ప్రమాదానికి అతి ముఖ్య కారణం.. బాంకెట్ హాల్‌ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ అని అధికారులు తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్‌ను నిర్మించారని తెలిపారు. అగ్నిప్రమాదాలకు కారణమయ్యే నిషేధిత మెటీరియల్, షీట్లు ఇతర మండే వస్తువులను ఉపయోగించారని వెల్లడించారు. దీనికి తోడు పెళ్లి వేడుకలో అలంకరణ కోసం ఉపయోగించిన వస్తువులు ఈ అగ్నికీలకు ఎగిసిపడటానికి మరింత ఆజ్యం పోశాయి.


మంగళవారం (సెప్టెంబర్ 29) రాత్రి 10.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బాంకెట్ హాల్‌లో 900 మంది వరకూ ఉన్నారు. కొంత మంది భోజనాలు చేస్తూ పెళ్లి వేడుకను తిలకిస్తుండగా.. మరి కొంత మంది ఇరత హాల్‌లలో ఉన్నారు. మంటలకు తాలలేక, పైకప్పు కూలి బయటపడే మార్గం లేక.. కొంత మంది గదుల్లో, బాత్రూమ్‌లలో తలదాచుకున్నారు. ఎక్కడివారు అక్కడే సజీవదహనమయ్యారు. వధూవరులు ఆ విషాద దృశ్యాలను పదే పదే గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ చేదు జ్ఞాపకాలతో ఆ నగరంలో (మోసుల్) ఇక ఎంతమాత్రం ఉండలేమని వారంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com