కావలసిన పదార్ధాలు: బేబీ కార్న్ - అరడజను, కార్న్ (మొక్కజొన్న పిండి) - 1 స్పూన్, క్యాప్సికమ్ - 1, ఉల్లికాడలు - కొన్ని, పచ్చిమిర్చి - రెండు, చిన్నుల్లిపాయలు - రెండు, అల్లం - చిన్నముక్క, చిల్లీసాస్ - 1 స్పూన్, టమాటో కెచప్ - 1 స్పూన్, సోయాసాస్ - 1 స్పూన్, మిరియాల పొడి - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత.
తయారీవిధానం:
-- బేబీ కార్న్ ను నిలువుగా రెండు చీలికలుగా లేదా అడ్డంగా రెండు ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లికాడలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
-- ఒక గిన్నెలో బేబీ కార్న్ ముక్కలు, మొక్కజొన్న పిండి, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి.
-- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి, సరిపడా నూనె పోసి, బాగా కాగాక అందులో బేబీ కార్న్ ముక్కలను వేసి దోరగా వేపుకోవాలి. ఇలా చేసేటప్పుడు, మంటను సిమ్ లో ఉంచాలి.
-- ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, చిన్న కళాయి పెట్టి, నూనె వేసి క్యాప్సికమ్, పచ్చిమిర్చి తరుగును, అల్లం - వెల్లుల్లి తరుగును, ఉల్లికాడల తరుగును వేసి దోరగా వేపుకోవాలి. దోరగా వేగుతుండగా, అందులో చిల్లీసాస్, టమాటో కెచప్, సోయాసాస్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత ఇందులో బేబీ కార్న్ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. ఈ మసాలా మొత్తం, బేబీ కార్న్ కు బాగా పట్టించేటట్టు గరిటెతో కలపాలి. అంతే... ఇంకేముంది... హోటల్ స్టైల్ బేబీ కార్న్ 65 రెడీ.