తాలిబన్ల దాష్టికానికి ముగ్గురు పిల్లల తల్లి బలి

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 14, 2021, 01:36 PM
 

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలయ్యాక వారు తమ హక్కులను ఎక్కడ కాలరాస్తారోనన్న భయంతో వందల మంది మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దీంతో ఆందోళన చేసిన మహిళలను మట్టు పెట్టడమే లక్ష్యంగా తాలిబన్లు దారుణాలకు పాల్పడుతున్నారు. తాలిబన్ల దాష్టికానికి ఫర్వా అనే మహిళ బలైపోయింది. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. దేశాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఆందోళన చేసిన మహిళల్లో ఫర్వా ఒకరు. శుక్రవారం ఇంట్లో ఉన్న ఫర్వాకు ఎవరో బయట సాయం కోసం అర్థిస్తున్నట్లు అనిపించింది.


బయటకు వెళ్లొద్దని ఆమె భర్త బతిమాలినప్పటికీ 6 నెలల బాబును భుజాలపై ఎత్తుకుని ఫర్వా బయటకు వెళ్లింది. మూడేళ్ల బాబు కూడా తల్లిని అనుసరిస్తూ బయటకు వెళ్లాడు. ఫర్వా బయటకు రాగానే తాలిబన్లు ఆమెను కాల్చి చంపేశారు. బిడ్డ భుజాలపై ఉండగానే ఫర్వా కన్నుమూసింది. తల్లి చనిపోయిందన్న విషయం గానీ, ప్రాణం లేని తల్లి దేహంపై పడుకుని ఉన్నాడన్న సంగతి గానీ ఆ 6 నెలల బాబుకు తెలియదు. తుపాకీతో కాల్చిన శబ్దం వినిపించడంతో ఫర్వా భర్త బయటకు వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా కనిపించింది. తన భార్య శవాన్ని తాలిబన్ల వద్దకు తీసుకెళ్లి ఎవరు కాల్చి చంపారని అడగ్గా.. ఎవరో కాల్చేసి ఉంటారని తాలిబన్లు సమాధానమిచ్చారు. 'వీధుల్లో జరుగుతున్న ఆందోళనల్లోకి నీ భార్య వెళ్లిందా’ అని ఓ తాలిబన్ ఫర్వా భర్తను అడిగాడు. ఇకపై మళ్లీ ఎప్పుడూ వెళ్లొద్దని చెప్పాడు. భార్యను చంపేసింది తాలిబన్లేనని అప్పుడు ఫర్వా భర్త హుస్సేనీకి అర్థమైంది. కానీ చేసేదేమీ లేక భార్య మృతదేహాన్ని, తన కొడుకులను ఇంటికి తీసుకెళ్లాడు.


తల్లి వెంట వెళ్లిన మూడేళ్ల బాబు ‘అమ్మకు ఏమైంది నాన్నా’ అని ఆ కన్నతండ్రిని అడిగాడు. అమ్మ నిద్రపోతోందని ఆ పిల్లాడిని హుస్సేనీ సముదాయించాడు. తల్లి శరీరంలోకి దూసుకెళ్లిన తుపాకీ తూటా శబ్దం బాగా దగ్గర నుంచివిన్న ఆ 6 నెలల బాబు భయంతో గుక్కపట్టి ఏడుస్తున్నాడని, సరిగ్గా తినడం లేదని హుస్సేని చెప్పాడు. అప్పటి నుంచి పిల్లాడు వణికిపోతున్నాడని చెప్పాడు.