నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అలవాటు పడిన యాప్..వాట్సాప్. చిన్నవాల్ల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ వాట్సప్ తోనే కాలక్షేపం చేస్తుంటారు. అందుకే వాట్సప్..మెస్సేంజింగ్ యాప్ లలో రారాజుగా వెలుగొందుతోంది. ఇటువంటి తరుణంలో వాట్సప్ గత కొన్ని రోజుల ముందు ప్రైవసీలకు సంబంధించి వివాదాల్లో చిక్కుకుంది. కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నప్పటికీ వాట్సాప్ ఖరాకండీగా ఓ విషయాన్ని బద్దలు కొట్టీమరీ చెప్పేసింది. కొత్త వివాదాస్పద ప్రైవసీ పాలసీని అంగీకరించేందుకు ఇచ్చిన మే 15 గడువును వెనక్కి తీసుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన వాట్సాప్, పాలసీని అంగీకరించకున్నా ఖాతాలను డిలీట్ చేయబోమని ప్రకటించింది. వారి ఖాతాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. కానీ అంతలోనే మనసు మార్చుకుంది. కొత్త నిబంధనలు అంగీకరించకుంటే వాట్సాప్ పూర్తిస్థాయిలో పనిచేయదని తేల్చి చెప్పింది. తమ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించని వారికి దాని గురించి పదేపదే గుర్తు చేస్తుంటామని, అయినా అంగీకరించని వారికి ఆ రిమైండర్ నిరంతరంగా మారుతుందని వాట్సాప్ తన వెబ్సైట్లో పేర్కొంది.
ఇది అందరికీ ఒకే కాలంలో జరగదని వివరించింది. ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే చాట్ లిస్ట్‌ను యాక్సెస్ చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. అయితే, ఇన్కమింగ్ ఫోన్, వీడియో కాల్స్‌కు ఆన్సర్ చేయగలరని పేర్కొంది. అది కొంత కాలం మాత్రమేనని, అప్పటికీ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకుంటే ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్ రావని, అంతేకాక మెసేజ్ పంపడం, కాల్స్ చేయడం కూడా ఆగిపోతుందని హెచ్చరించింది. కొత్త నిబంధనలు అంగీకరించకున్నా యూజర్ల ఖాతాలను డిలీట్ చేయబోమని, అప్పటికే వారు అంగీకరించిన పాత పాలసీ వర్తిస్తుందని తెలిపింది. సాధారణంగా వాట్సాప్ ఖాతాలు 120 రోజులపాటు ఇనాక్టివ్‌గా ఉంటే ఆ తర్వాత అవి డిలీట్ అవుతాయి. దీంతో ఈ విషయం తెలిసి యూజర్లు ఫైర్ అవుతున్నారు.