ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరగా జుట్టు తెల్లబడడానికి కారణమిదే... ఇలా చేస్తే సమస్యకు చెక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 01:36 PM

సహజంగా వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం వయసుతో సంబంధం లేకుండా కలర్ మారిపోతుంది. జుట్టుకు నల్ల రంగును తెచ్చే మెలనిన్... తలలోని చర్మం కింది భాగంలో, వెంట్రుకల్లో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల జుట్టు తెలుపు రంగులో కనిపిస్తుంది. ప్రతీ వెంట్రుకా పారదర్శకంగా ఉంటుంది. అందులో మెలనిన్ ఉంటే అది నలుపు రంగులో కనిపిస్తుంది. మెలనిన్ లేకపోతే వెంట్రుక తెలుపుగా కనిపిస్తుంది.


మెలనిన్ అయిపోవడానికి కారణాలు :


జన్యువులు : తల్లిదండ్రులకూ, తాత ముత్తాతలకు త్వరగా వైట్ హైయిర్ వస్తే... తరువాతి తరాల వాళ్లకు కూడా అలా జరిగే అవకాశాలుంటాయి. జన్యువుల్లో మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి.


టెన్షన్లు : పని ఒత్తిళ్లు, టెన్షన్లు, బిజీ లైఫ్ స్టైల్, నిద్రలేమి, ఆహార మార్పులు, హైబీపీ వంటివి మన తలలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.


ఆటో ఇమ్యూన్ డిసీజ్ : ఒక్కోసారి మన శరీరంలోని వ్యాధి నిరోధకత తన సొంత కణాలపైనే దాడి చేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.


థైరాయిడ్ సమస్య : మన గొంతులో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది శరీరంలోని చాలా అవయవాలు సరిగా పనిచేసేలా చేస్తుంది. ఇది సరిగా పనిచెయ్యకపోతే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.


విటమిన్ B-12 తగ్గిపోతే : త్వరగా జుట్టు నెరిసిపోయిందంటే దానర్థం మనలో విటమిన్ B-12 సరిపడా లేనట్లే. ఇది జుట్టుకు ఎంతో మేలు చేసే విటమిన్. ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ఎర్రరక్తకణాలు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ బీ-12 సహకరిస్తుంది. అది లేనప్పుడు ఎర్రరక్తకణాలు దెబ్బతిని... జుట్టు కణాలకు సరైన ఎర్రరక్తకణాలు చేరవు. ఫలితంగా జుట్టు కణాలు దెబ్బతిని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. విటమిన్ B-12 కోసం చేపలు, బాదం, పీతలు, పాలు, వెన్న, గుడ్లు, చికెన్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు.


స్మోకింగ్ : పొగతాగడం మానకపోతే... అది జుట్టుకి పొగబెడుతుందని పరిశోధనల్లో తేలింది. ఎలాగంటే పొగ ఎర్రరక్తకణాల్ని దెబ్బతీస్తుంది.


జన్యుపరంగా జుట్టు తెల్లబడితే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇతర కారణాలతో మార్పులు వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. మెలనిన్ పెంచుకోవడానికి క్యారెట్, నల్ల నువ్వులు, వాల్‌నట్స్, ఉసిరి, సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు, మసూరి పప్పులు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి.


నువ్వుల నూనె, మెంతుల పౌడర్‌ని కలిపి తలకు మసాజ్ చేసి... అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకల్లో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుందని తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com