విద్యా బుద్ధులు నేర్పాల్సిన వారే బుద్ధి తక్కువ పని చేశారు... సన్మార్గం వైపు తీసుకువెళ్లాల్సిన వారే వక్రమార్గం పట్టారు. ఓ విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించి కటకటాలపాలైన ఘటన నెల్లిమర్ల మండలం కొండవెలగాడ ఉన్నత పాఠశాలలో మంగళవారం వెలుగుచూసింది. ఆ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎం.వెంకటరావుదొరపై పోక్సో కేసు నమోదైంది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ బి.గణేష్ వివరించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక పట్ల ఉపాధ్యాయుడు వెంకటరావుదొర తరచూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బాలిక వీపు పైన, భుజాల పైన తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడన్నది బాలిక తల్లి ఆరోపణ. మూడు రోజులుగా ఆ బాలిక ఇంటి వద్ద మౌనంగా ఉండడంతో తల్లి అసలు విషయంపై ఆరా తీసింది.
ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన గురించి వివరించింది. దీనిపై తల్లి మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లి నిలదీయడంతో పాటు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్‌ఐ బి.గణేష్ సిబ్బందితో పాఠశాలకు వెళ్లి వాస్తవ పరిస్థితులపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయుడు జ్ఞాన శంకర్‌తో మాట్లాడారు. నిందితుడు ఉపాధ్యాయుడు వెంకటరావును అదుపులోకి తీసుకుని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరవుతుంటాడని, పిల్లలను ఎప్పటికప్పుడు క్రమశిక్షణ పేరుతో ఉద్దేశపూర్వకంగా గట్టిగా కొడుతుంటాడని ఆరోపణలు ఉన్నాయి. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ జడ్పీ పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు ఎం.వెంకటరావు దొర అసభ్యంగా ప్రవర్తించినట్లు డిప్యూటీ డీఈవో విచారణలో నిర్ధారణ అయ్యిందని పేర్కొంటూ ఆయనను సెస్పెండ్ చేస్తున్నామని డీఈవో మాణిక్యం నాయుడు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు విద్యార్థినులను భౌతికంగా హింసించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నుంచి అందిన ఫిర్యాదు మేరకు విచారించామని తెలిపారు.