దీపావళి వచ్చిందంటే చాలు.. చిన్నారులు, యువకుల్లో ఒకటే సందడి. నెలరోజుల ముందే నుంచే టపాసుల కొనుగోలు.. బాణసంచా తయారీతో బిజీబిజీగా గడుపుతారు. ప్రతి ఇంటా వెలుగులు నింపే.. బాణసంచాతో అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు తప్పవు. శ్రీకాకుళం జిల్లాలో గతంలో పలుచోట్ల జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2004 నవంబరు 4న జరిగిన దుర్ఘటనను శ్రీకాకుళం నగరవాసులతోపాటు.. జిల్లా ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. శ్రీకాకుళం నగరం చిన్నబజారు రోడ్‌లో పోలిశెట్టి సూరజ్ అనే వ్యక్తి.. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి ఇంటి వద్దే బాణసంచా సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగించేవారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు ఆ ఇంట్లో సంభవించిన భారీ పేలుడు ఘటనలో ఓ పసిపాపతో సహా 12మంది మృత్యువాత పడ్డారు. మరో ఇరవై మంది వరకు గాయపడ్డారు. పది కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి.
చుట్టు పక్కల ఇళ్లు, వాపార సముదాయాల్లో ఉన్న గాజు సామాన్లు, అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆ పేలుడు శబ్దాలకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగ.. భారీ మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటి ఎస్పీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై మంటల్లో ఉన్న బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ దుర్ఘటనలో సూరజ్ భార్య, కుమార్తె, ఇద్దరు కోడళ్లతోపాటు అక్కడ పనిచేసే వారితో సహా 8 మంది దుర్మరణం చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడగా.. వారిని శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. భారీ పేలుడు కారణంగా.. దూరంగా ఉన్న ఓ పసిపాప సైతం మృతి చెందింది. ఓ వైపు మంటలు అదుపు చేస్తున్నా.. బాణసంచా సామగ్రి పేలుతుండడంతో ప్రజలు భయాందోళన చెందారు. బాణసంచా సామగ్రి వ్యర్థాలను ఓ లారీలో వేసి.. ఆర్ట్స్ కళాశాల వెనుక ఉన్న శాంతినగర్ కాలనీలో నది సమీపంలో డంపింగ్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా.. డంపింగ్ సమయంలో మరోసారి పేలుడు సంభవించింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న గార స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు సుందరరావు, రామచంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి శ్రీకాకుళం సీఐ కృష్ణమూర్తి నాయుడు, వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.అప్పారావు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన కానిస్టేబుళ్లను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుందరరావు మృతి చెందారు. ఇలా 20 ఏళ్ల కిందట జరిగిన దుర్ఘటన పలు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది.