చిత్తూరు జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతి నెలా అధికార యంత్రాంగంతో సమీక్షిస్తామని మంత్రి సతప్రసాద్ వెల్లడించారు. అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ చేసిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తమది ప్రో యాక్టివ్ ప్రభుత్వమని ప్రజలకు మేలు చేసే నిర్ణయాలతో ముందుకు వెళతామన్నారు. ఇసుకపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని అభిప్రాయపడిన మంత్రి.. ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇస్తామన్నారు. సీనరేజీ విధిస్తే దానిపై జీఎస్టీ కూడా తోడై పేదలపై భారం పడుతుందన్నారు. అందుకే పేదలు, ప్రజల అవసరాలకు వీలుగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ఇసుక తరలింపునకు సీనరేజీని సీఎం చంద్రబాబు తొలగించారన్నారు. ఇసుక అక్రమ రవాణాను, పక్క రాష్ట్రాలకు తరలించడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. సత్యవేడు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దుల్లో.. చెన్నైకి చేరువగా ఉండటం వంటి కారణాలతో ఇసుక స్మగ్లింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.