కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆస్థానం ఉంటుంది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి తిరుమాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. దీపావళి ఆస్థానం కారణంగా 31న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. తిరుమలలో దీపావళి ఆస్థానం కారణంగా గురువారం తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. అలాగే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. కాగా దీపావళి పండుగ రోజున తిరుమలలో ఆస్థాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆస్థాన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కార్తీక మాసం ఆరంభంతో పాటుగా నవంబర్ నెలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల వివరాలను టీటీడీ ప్రకటించింది. నవంబరు 1న కేదారగౌరీ వ్రతం, 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం నిర్వహించనున్నారు.10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, 12న ప్రబోధన ఏకాదశి, 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి పర్వదినాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.