ఢిల్లీలో ఏపీ నూతన భవన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ‘రీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లకు టెండర్లు పిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలో ఏపీ భవన్ విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి భవన్ విభజన ఖరారు చేశారు. రెండు రాష్ట్రాల అధికారుల ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న భవనాలను కలిపి రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి. కొత్త భవన్ నిర్మాణం చేపట్టాల్సి రావడంతో ఏపీ ప్రభుత్వం డిజైన్ల ప్రక్రియ మొదలు పెట్టింది.
ప్రస్తుతం గోదావరి, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడి హౌస్.. మూడు చోట్ల నిర్మాణానికి డిజైన్లు ఆహ్వానించింది. మూడు ప్రదేశాల్లో కలిపి మొత్తం 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ డిజైన్లు కోరింది. బుధవారం సాయంత్రం లోపు ఆసక్తి ఉన్న గుత్తేదారులు తమ 'ఎస్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్' ను సంబంధిత వెబ్‌సైట్‌లో ఆప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 28 లోపు తమ ప్రతిపాదనలు సమర్పించాలని రహదారులు, భవనాల శాఖ విజయవాడ సర్కిల్ ఎస్ఈ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.కాగా ఢిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో తెలంగాణ వాటాగా 8.245 ఎకరాలు, ఏపీ వాటాగా11.536 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించారు. అలాగే ఏపీకి 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌ను కేటాయిస్తూ నిర్ణయించారు. అలాగే ఏపీకి నర్సింగ్ హాస్టల్‌లో 3. 359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఢిల్లీలో తెలుగువారికి చిరునామాగా నిలిచే ఏపీ భవన్ ఆస్తుల పంపకం ఎట్టకేలకు పూర్తి అయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఆస్తుల పంపకం కొలిక్కి రాకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. తాజాగా ఏపీ భవన్ విభజనపై కేంద్రహోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలోనే ఉమ్మడి ఆస్తులను ఏపీ, తెలంగాణకు 52:48 నిష్పత్తిలో పంచారు.