ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేయి కోసుకున్న ప్రియురాలు.. షాక్‌తో ఆగిన యువకుడి గుండె

national |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:48 PM

చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియురాలు ఆసుపత్రిలో చేరగా.. ఆమె పరిస్థితి చూసి షాక్‌‌తో ప్రియుడి గుండె ఆగిపోయింది. అత్యంత హృదయవిదారకమైన ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. భవిష్యత్తు కోసం బంగారు కలలు కన్న ఆ ప్రేమజంట కథ విషాదంగా ముగిసింది. వివరాల్లోకి వెళ్తే.. జగత్‌పురి ప్రాంతానికి చెందిన యువతి లా విద్యార్ధిని (23), చంద్ పార్క్‌కు చెందిన అర్జున్ నంద (30)కు ఏడాది కిందట ఆన్‌లైన్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నిరుద్యోగి అయిన నంద.. ఉద్యోగన్వేషణలో ఉండగా... ఈ విషయంలో ఇరువురి మధ్య కొద్ది రోజుల నుంచి వాగ్వాదం జరుగుతోంది.


ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఇరువురూ గొడవపడ్డారు. ఇందులో అర్జున్ బంధువు ఒకరు జోక్యం చేసుకోవడంతో యువతి తీవ్రంగా కలత చెందింది. దీనిని అవమానంగా భావించిన ఆమె ఇంటికి తిరిగొచ్చిన తర్వాత రాత్రి 11.30 గంటల సమయంలో పదునైన వస్తువుతో మణికట్టు వద్ద నరాలు కోసుకొని ఆత్మహత్యాత్నం చేసింది. ఆ వీడియోను అరుణ్‌ నందాకు వాట్సప్‌లో పంపింది. ఆ వీడియో చూసి కంగారుపడిపోయిన అరుణ్‌.. వెంటనే ఈ విషయం గురించి ఆమె తల్లికి సమాచారం ఇచ్చాడు. అనంతరం ఇంటికి చేరుకుని హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించాడు.


శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఆమెను గురు తేజ్‌ బహదూర్ ఆసుపత్రిలో చేర్చించాడు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైద్యుడికి పరిస్థితి వివరించాడు. ఆమె చేతి నుంచి రక్తస్రావం అధికకావడంతో చికిత్స పొందుతున్న దశలో పరిస్థితిని చూసి అర్జున్ స్పృహతప్పి ఆసుపత్రి వరండాలో పడిపోయాడు. దీనిని గమనించిన వైద్య సిబ్బంది వెంటనే అతడికి చికిత్స ప్రారంభించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించింది. అరుణ్‌ను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నాలు విఫలమై చనిపోయాడు. యువకుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్టు వైద్యులు భావించారు.


ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. యువతి పరిస్థితి చూసి ఆందోళనకు గురై అరుణ్‌ గుండె ఆగి మరణించి ఉంటాడని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఓ నిర్ధారణకు రావచ్చని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ‘ఆమెను రక్షించండి.. ఆమె చనిపోతుంది’ అని తన స్నేహితుడితో అర్జున్ చెప్పిన చివరి మాటలు ఇవే. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన వల్ల కలిగే మానసిక క్షోభను తట్టుకునేందుకు ఆమెకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com