ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిష్కారం చూపమని దేవుడ్ని వేడుకున్నా.. రామమందిర వివాదం తీర్పుపై సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:46 PM

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడు మార్గాన్ని కనుగొంటాడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. తన స్వగ్రామమైన మహారాష్ట్రలోని కన్హెర్సర్‌ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల ఆయనకు సన్మాన సభ ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తరుచూ కేసులు ఉంటాయని, కానీ కొన్ని పరిష్కారం చూపలేనంత క్లిష్టంగా ఉంటాయన్నారు. అయోధ్య వివాదం సమయంలోనూ అదే జరిగిందన్నారు.


‘తరచుగా మాకు చాలా కేసులు ఉంటాయి..కానీ మేము ఒక పరిష్కారానికి రాలేం.. మూడు నెలల పాటు అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసు విచారణ సమయంలో అలాగే జరిగింది.. నేను భగవంతుడి ఎదుట నిలబడి పరిష్కారం చూపమని వేడుకున్నాను’ అని సీజే తెలిపారు. తాను రోజూ దేవుడ్ని పూజిస్తానని అన్నారు. భగవంతుడిపై నమ్మకం ఉంటే తప్పకుండా సమస్యకు పరిష్కారం చూపుతాడని అన్నారు. ‘నేను చెప్పేది నిజం... నీకు నమ్మకం ఉంటే భగవంతుడు ఎల్లప్పుడూ మార్గాన్ని చూపిస్తాడు’ అని పేర్కొన్నారు.


రామమందిర-బాబ్రీ మసీదు వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2019 నవంబరు 9న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన దాదాపు 135 ఏళ్లుగా కొనసాగుతోన్న వివాదానికి సుప్రీం కోర్టు తీర్పుతో ముగిసిపోయిన విషయం తెలిసిందే. వివాదాస్పద రెండున్నర ఎకరాల స్థలాన్ని హిందూ పక్షాలకు అప్పగించిన కోర్టు.. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ఈ చరిత్రాత్మక తీర్పు వెలువరించిన నాటి రాజ్యాంగ ధర్మాసనంలో ప్రస్తుత సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్‌ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో వివాదానికి తెరపడి.. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కల సాకారమైంది. ఐదు శతాబ్దాల తర్వాత రాముడికి జన్మభూమిలో ఆలయం నిర్మితమైంది. ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సీజేఐ చంద్రచూడ్ జులైలో ఆలయాన్ని సందర్శించి, పూజలు నిర్వహించారు.


జస్టిస్ చంద్రచూడ్ నవంబరు 10న పదవీవిరమణ చేయనున్న విషయం తెలిసిందే. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపి, రాష్ట్రపతి వద్దకు పంపుతుంది. రాష్ట్రపతి భవన్‌ నుంచి అనుమతి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com