ట్రెండింగ్
Epaper    English    தமிழ்

36 గంటల్లోగా భారీ వర్షాలు.. టీటీడీ ఉన్నతస్థాయి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 07:06 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అప్రమత్తమైంది. ఇప్పటికే తిరుమలలో గత రెండురోజులుగా వర్షం కురుస్తోంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో టీటీడీ కూడా అలర్ట్ అయ్యింది. అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే విపత్తు నిర్వహణ ప్రణాళికపై అదనపు ఈవో వెంకయ్య చౌదరితో చర్చించారు.


వచ్చే 36 గంటల్లో తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న టీటీడీ ఈవో.. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను అనుసరించి అందరూ అప్రమత్తంగా ఉండాలని.. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక ముందుస్తు చర్యల్లో భాగంగా తిరుమలలో అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే అక్టోబర్ 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ప్రకటించారు. అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈవో శ్యామలరావు సూచించారు.


కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొండచరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని టీటీడీ ఈవో సూచించారు. అలాగే ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలను పర్యవేక్షించాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే జనరేటర్లు వాడేందుకు డీజిల్ అందుబాటులో ఉంచాలన్నారు. శ్రీవారి భక్తులకు దర్శనం, వసతి, ప్రసాదాల కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఐటీ విభాగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని టీటీడీ ఈవో ఆదేశించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని.. అలాగే ఇంజనీరింగ్ విభాగం డ్యా్మ్ గేట్లను పర్యవేక్షించాలని టీటీడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.


ఘాట్ రోడ్లలో ట్రక్కులు, ట్రాక్టర్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచాలని.. ఫైరింజన్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని ఈవో ఆదేశించారు. వాతావరణ సమాచారం గురించి భక్తులను మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు, మరోవైపు 2021లో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనతో టీటీడీ విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందనీ.. ఈ ప్రణాళికను మరింత మెరుగు పరచాలని టీటీడీ ఈవో అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com