కన్న తండ్రే రక్తం పంచుకొని పుట్టిన పసికందు పట్ల కర్కశంగా వ్యవహరించాడు. ఆడపిల్ల అన్న కారణంతో అనారోగ్యానికి గురైనా పట్టించుకోలేదు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా కనికరం చూపలేదు. బిడ్డకు వైద్యం చేయించాలని తల్లి వేడుకున్నా వినిపించుకోలేదు. దీంతో రెండు నెలల చిన్నారి నరకయాతన పడి ప్రాణం విడిచింది. సింగరాయకొండలో 15 రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని డ్రైవర్‌పేట రెండో వీధిలో నివాసం ఉండే షేక్ సందానీబాషాకు పాకల గ్రామానికి చెందిన షేక్ రషీదాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది తరువాత వారికి ఒక పాప జన్మించింది. ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి భార్తతోపాటు అత్తమామలు రషీదాను వేధించడం ప్రారంభించారు. ఈతరుణంలో మరుసటి ఏడాదికి రషీదా మరలా గర్భం దాల్చింది. మళ్లీ ఆడబిడ్డ జన్మిస్తుందన్న అనుమానంతో రషీదా భర్త సందానీ, అత్తమామలు ఆమెను నిత్యం వేధించారు. సక్రమంగా వైద్యం కూడా అందించలేదు. దీంతో ఈ ఏడాది జూలై 31వ తేదీన 7నెలలకే ఒంగోలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు రషీదా జన్మనిచ్చింది. డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి బిడ్డ గుండెకు రంధ్రాలు ఉన్నాయని, మెరుగైన చికిత్స అందిస్తేనే బతుకుందని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకొని కూడా రషీదా భర్త, అత్తమామలు నిర్లక్యంగా వ్యహరించారు. ఆతరువాత రషీదా తన తల్లిదండ్రుల సహకారంలో పాపను చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకొని సింగరాయకొండకు వచ్చింది. ఆతరువాత కూడా భర్త, అత్తమామలు సహకరించపోయినా పలుమార్లు పాపను ఆసుపత్రులు చుట్టూ తిప్పింది. గత నెల 24వతేదీన ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లగా రషీదాతోపాటు పాపను సందానీ బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి పాపకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగామారి యాతన అనుభవిస్తున్నా ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో ఆ పాప గత నెల 26 తేదీ రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచింది. 27 తేదీ పాకల రోడ్డులోని శ్మశాన వాటికలో పాప మృతదేహాన్ని పుడ్చిపెట్టారు. తన బిడ్డ మరణానికి భర్త, అత్తమామలే కారణమని ఈ నెల 3వ తేదీన రషీదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ హజరత్తయ్య స్పందించి కేసు నమోదు చేశారు. ఈనెల 5వ తేదీన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చింది.