ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దటీజ్ పవన్ కళ్యాణ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:47 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. తన సొంత నిధులతో అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లి స్కూల్‌కు క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఇటీవల మైసూరవారిపల్లి గ్రామసభకు వెళ్లిన సంగతి తెలిసిందే.. అక్కడి స్కూల్‌కు ఆటస్థలం లేదన్న విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. దసరాలోపు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నెరవేర్చారు. పవన్ కళ్యాణ్ తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. దీనికి సంబంధించిన పత్రాలను మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీ సభ్యులకు అందజేశారు.


ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో.. రాజకీయాల్లోకి రావడానికి ముందే లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్సు పేరిట ట్రస్టు మొదలుపెట్టానన్నారు పవన్ కళ్యాణ్. విద్యార్థుల చదువుకు సాయం చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ట్రస్ట్ ఉద్దేశమని వివరించారు. తాము ఎంతోమంది చదువులకు సాయం చేసినా సరే ఎప్పుడూ బయటకు చెప్పలేదన్నారు. మైసూరవారిపల్లి స్కూల్ ఆటస్థలం కోసం.. ముందు రూ.20 లక్షలు ఇచ్చి మిగిలిన మొత్తానికి దాతల సహకారం తీసుకోవాలనుకున్నట్లు తెలిపారు. కానీ ఆట స్థలం విషయంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో మొత్తం రూ.60 లక్షలు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి స్కూల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలోని 32 ప్రాథమిక ఉన్నత పాఠశాలాల్లో చదువుతున్న విద్యార్థులకు, క్రీడల్లో ప్రోత్సాహం అందించారు పవన్ కళ్యాణ్. ప్రతి పాఠశాలకు రెండేసి చొప్పున, క్రీడా సామాగ్రి కిట్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. . ఒక్కొక్క కిట్ దాదాపు 25 వేల రూపాయలు, మొత్తం కిట్ల కు 16 లక్షల రూపాయలు అవసరం ఉండటంతో, కిట్లకు అవసరమైన నిధులను CSR ఫండ్స్ ద్వారా సేకరిస్తామని జిల్లా కలెక్టర్ S. షాన్మోహన్ తెలియజేశారు.


పర్యావరణాన్ని రక్షించుకోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో జరిగిన కాలుష్య నియంత్రణ మండలి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. పర్యావరణ హితం పరిశ్రమల బాధ్యత కావాలని.. అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు.. భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించడం తమ బాధ్యత అన్నారు. జల, వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణహిత పారిశ్రామికీకరణ ప్రస్తుత సమాజ అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు డిప్యూటీ సీఎం. అయితే వీలైనంత తక్కువ కాలుష్యం ఉండేలా వాటి ప్రణాళికలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పీసీబీ అంటే పరిశ్రమలకు వ్యతిరేకమనడం సరికాదని వ్యాఖ్యానించారు.


పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నారు పవన్ కళ్యాణ్. అలాగే కాలుష్య రహిత పరిశ్రమలు, వాటి విధివిధానాల రూపకల్పనకు నిపుణులు, మేధావులు విలువైన సూచనలు అందించాలి అన్నారు. రాబోయే ఐదేళ్లలో కాలుష్య నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని.. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ సూచనలు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలపై ప్రధానంగా చర్చ జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com