ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ భారీ విజయం.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీలో అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 09:35 PM

మావోయిస్ట్ తీవ్రవాదాన్ని 2026వరకు సమూలంగా అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదటినుంచి భారీగా నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లను చేపడుతోంది. ఈ ఆపరేషన్లలో భాగంగానే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 202 మంది మావోయిస్టులను హతం చేసింది. 801 మందిని అరెస్ట్ చేయగా.. 742 మందిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇక ఈ గణాంకాలను స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.


దేశంలో నక్సల్స్ తీవ్రవాదం తుదిదశకు చేరుకుందని అమిత్‌ షా వెల్లడించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో.. అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గైర్హాజరు కాగా.. ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరభ్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమల పాల్గొన్నారు. వీరితోపాటు బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇక కేంద్రమంత్రులు జేపీ నడ్డా, నిత్యానందరాయ్, జుయెల్ ఓరం, సంబంధిత శాఖకు చెందిన కేంద్ర అధికారులు కూడా పాల్గొన్నారు.


దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా వరకు నక్సలిజం అంతం అయిందని.. అయితే 2026 నాటికి పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఈ సమీక్ష నిర్వహించారు. మావోయిస్టుల కట్టడి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టిందని పేర్కొన్న అమిత్ షా.. ఇప్పటివరకు 13 వేల మందికి పైగా నక్సల్స్ ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. 2024లో 202 మంది మావోయిస్టులు మృతిచెందగా.. 723 మంది లొంగిపోయారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల లభించిన భారీ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని.. అక్కడ కొందరు మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్న అమిత్‌ షా.. భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు


మావోయిస్ట్ రహితంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని ఈ సందర్భంగా అమిత్ షా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌ సీఎం, డీజీపీని అమిత్ షా అభినందించారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు 15 రోజులకు ఒకసారి నక్సల్ నిర్మూలనపై రివ్యూ మీటింగ్ నిర్వహించాలని అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల్లో డీజీపీలు పర్యటించాలని.. 2026 నాటికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.


10 ఏళ్లలో కేంద్రంలోని మోదీ సర్కార్‌ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. 11,500 కిలోమీటర్ల మేర రోడ్‌ నెట్‌వర్క్‌తో పాటు 15,300 సెల్‌ఫోన్‌ టవర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు కొత్తగా నెలకొల్పినట్లు తెలిపారు. గతంలో 16,400కు పైగా హింసాత్మక ఘటనలు జరగ్గా.. ప్రస్తుతం 7,700లకు తగ్గాయని వెల్లడించారు. ప్రజలు, భద్రతా బలగాల మరణాలు 70 శాతం తగ్గాయని పేర్కొన్నారు. హింసాత్మక ప్రభావిత జిల్లాలు 96 నుంచి 42కు తగ్గినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనలు నమోదయ్యే పోలీస్ స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి పడిపోయినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సమన్వయంతోనే ఇది సాధ్యమైందని అమిత్‌ షా వెల్లడించారు. 2014 నుంచి ఇప్పటివరకు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రూ.3006 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com