ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ను ప్రేమించి, పాక్‌ను పెళ్లి చేసుకుంది.. నరేంద్ర మోదీ, అమిత్ షాకు మల్లికార్జున ఖర్గే కౌంటర్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 10:09 PM

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు కావడంతో అక్కడ బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఇక ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి కలిపి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీ మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్-ఎన్సీ కూటమిపై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై మండిపడ్డారు.


బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన మల్లికార్జున ఖర్గే.. బీజేపీ భారత్‌ని ప్రేమించవచ్చు.. కానీ అది పాకిస్తాన్‌ను వివాహం చేసుకుందని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రజల సంక్షేమం, అభివృద్ధి పైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. అదే సమయంలో పాకిస్తాన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఖర్గే తేల్చి చెప్పారు. జమ్మూలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఖర్గే.. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌లో పర్యటించిన విషయాన్ని ప్రస్తావించారు.


బిర్యాని తిని కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాకిస్తాన్‌కు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కౌగిలించుకోవడాన్ని ఈ సందర్భంగా ఖర్గే ప్రస్తావించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా చెప్పేవన్ని అబద్ధాలే అని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నారని.. అయితే ఆయన కేంద్రం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేద అని బీజేపీని ప్రశ్నించారు.


ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు.. కాంగ్రెస్-ఎన్సీ కూటమి పాకిస్తాన్ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమికి ఓటు వేస్తే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని.. ఇది కాశ్మీర్ లోయలో మళ్లీ హింసకు దారి తీస్తుందని ప్రధాని మోదీ ఇటీవల కాశ్మీర్ ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్‌కు వేసిన ఓటు పీడీపీ, ఎన్సీల హామీలను అమలు చేస్తుందని.. ఆ రెండు పార్టీలు ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్‌లో తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నాయని.. లోయలో రక్తపాతాన్ని కోరుకుంటున్నారని ప్రధాని మండిపడ్డారు.


అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు పాకిస్తాన్‌కు చాలా సంతోషాన్ని ఇస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాశ్మీర్ లోయలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి రెండూ కలిసి ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఆరోపణలపై స్పందించిన ప్రధాని.. వ్యాఖ్యలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com