ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్

international |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 09:57 PM

భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు.. క్రమంగా ఒక్కటై మన దేశానికి పెను సవాల్‌ను విసురుతున్నాయి. ఇప్పటికే భారత్ పేరు చెప్పగానే చైనా, పాకిస్తాన్‌ దేశాలు.. ఒక్కటవుతాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌కు.. భారత్‌కు వ్యతిరేకంగా చైనా కాపాడుతూ ఉంటుంది. ఇక పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడటంలో బంగ్లాదేశ్‌కు భారత్ సహాయం అందించడంతో.. అప్పటి నుంచి భారత్‌తో బంగ్లాదేశ్ సత్సంబంధాలు సాగిస్తూ వచ్చింది. దశాబ్దాల కాలంగా బంగ్లాదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన షేక్ హసీనా.. ఇటీవల పదవిని, దేశాన్ని వదిలేసి భారత్‌లోకి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఇదే అదునుగా భావించిన పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌కు దగ్గరవుతోంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం భారత వ్యతిరేక, పాక్ అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఆ రెండు దేశాలు ఒక్కటవుతుండటం.. ప్రస్తుతం భారత్‌ను ఆందోళకు గురి చేస్తోంది. పాక్ వద్ద బంగ్లాదేశ్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తుండటం సంచలనంగా మారింది.


రిజర్వేషన్ కోటాని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసాత్మక అల్లర్లతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌లోకి పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంలో లౌకిక దేశంగా ఉన్న బంగ్లా కాస్తా ఇస్లామిక్ రాడికల్ దేశంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో హిందూ ముస్లింలు కలిసి ఉండగా.. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు.. పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి.


ఇక బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు బలపడి దగ్గరవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే పాక్ రక్షణ రంగ సంస్థలు కూడా బంగ్లాదేశ్ ఆర్డర్లను వేగంగా డెలివరీ చేసేందుకు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ఆదేశాలు అందుకున్నారని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ 40 వేల రౌండ్ల మందుగుండు సామగ్రి.. 2 వేల యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామగ్రి.. 40 టన్నుల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు.. 2900 హై-ఇంటెన్సిటీ ప్రొజెక్టైల్‌ని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ నుంచి ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి మొత్తం 3 దశల్లో బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ అప్పగించనుంది. ఇందులో మొదటిది ఈ ఏడాది సెప్టెంబర్‌లో తొలి విడత ఆయుధ సరఫరా చేయనుండగా.. డిసెంబర్ 2024 వరకు మూడో దశ డెలివరీ పూర్తి కానుంది.


అయితే పాకిస్తా్న్ నుంచి బంగ్లాదేశ్ ఇలా ఆయుధాలను కొనుగోలు చేయడంపై భారత్‌కు హెచ్చరిక లాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న అంతర్గత ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ భారత వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఆ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న బీఎన్పీ, జమాతే ఇస్లామీ పార్టీలు ఏకంగా భారత్‌కు హెచ్చరికలు చేసే స్థాయిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్, పాక్ ఒక్కదగ్గరికి రావడం భారత్‌కు ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పాక్‌కు బంగ్లాదేశ్ ఇచ్చిన ఆర్డర్లలో సరిహద్దు నుంచి 30 కిలోమీటర్ల వరకు పేల్చగలిగే ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే బంగ్లా చుట్టూ భారత్ ఉండటం.. మన దేశాన్ని టార్గెట్ చేస్తూనే ఈ ఆయుధాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com