ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లైవ్ పెట్టాల్సిందేనంటున్న బొత్స.. జోకులేయమాకండి అంటున్న టీడీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 08:17 PM

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య శనివారం కీలక భేటీ జరగనుంది. ప్రజాభవన్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో.. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ భేటీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై.. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. విపక్ష నేతగా బొత్స కీలక డిమాండ్ చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి జరగనున్న సమావేశంలో ఏపీ పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోందని బొత్స అన్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తూ బొత్స ట్వీట్ చేశారు.


" విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో.. పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను." అంటూ బొత్స ట్వీట్ చేశారు.


అయితే బొత్స సత్యనారాయణ చేసిన ట్వీట్‌పై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జోకులేయకండి బొత్స గారూ అంటూ సెటైర్లు వేసిన వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. పారదర్శకత వంటి పెద్ద పదాలు వాడొద్దంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. "భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ..? పారదర్శకతకు పాతరేసిందే మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారు.. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.. సమావేశమయ్యాక.. అన్ని తెలుస్తాయి" అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.


మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి కూడా బొత్స ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా ఆవేశపడకండని బొత్స సత్యనారాయణకు సూచించారు. జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా, అప్పనంగా ఏపి భవనాలు అప్పగించారని.. ఆ విషయాన్ని ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. ఢిల్లీలో ఏపి భవన్ ఇచ్చేస్తాం, బందర్ పోర్టులో వాటా ఇస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలను మర్చిపోలేదని విమర్శించారు. అప్పట్లో తాళాలు పగలగొట్టి ఏపీ ఆయుష్ భవనాన్ని స్వాధీనం చేసుకుంటుంటే వైసీపీ ప్రభుత్వం సైలెంట్‌గా ఉండిపోయిందన్న అమర్‌నాథ్ రెడ్డి.. పోలవరం నీళ్ళు కేసీఆర్ తీసుకుని వెళ్తామని చెప్పిన మాటలను తాము మర్చిపోలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తారని.. కేసుల కోసం, ఆస్తుల కాపాడుకోవాల్సిన పని ఆయనకు లేదంటూ బొత్సకు కౌంటర్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com