ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులైలో దంచికొట్టనున్న వర్షాలు... శుభవార్త చెప్పిన ఐఎండీ

national |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 09:46 PM

ఈ ఏడాది దేశంలోకి నైరుతు రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినా.. జూన్‌లో ఆశించిన మేర వర్షాలు కురిపించలేదు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా జూన్ నెలలో 11 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ).. రైతాంగానికి శుభవార్త అందజేసింది. జులైలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈశాన్య, వాయవ్య, తూర్పు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా అధిక వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు.


సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జులైలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 28.04 సెం.మీ. కాగా.. ఈసారి సాధారణం కంటే అధికంగా (106% మేర) వర్షాలు పడతాయని ఆయన చెప్పారు. అంతేకాదు, హిమాలయ పశ్చిమ ప్రాంతం, మధ్య భారతంలో వరదలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గోదావరి, మహానది బేసిన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉన్నట్టు ఐఎండీ డైరెక్టర్ పేర్కొన్నారు. పశ్చిమ తీరం మినహా అన్ని రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా గానీ ఉంటాయని మృత్యుంజయ్‌ మహాపాత్ర అన్నారు.


ఇక, జూన్‌ సగటు ఉష్ణోగ్రతలకు వస్తే 1901 (31.7 డిగ్రీల సెల్సియస్‌) తర్వాత ఈ ఏడాది వాయవ్య భారత్‌లో అత్యధిక ఉష్ణోగ్రత (38.02 డిగ్రీలు) నమోదైందని వివరించారు. గత నెలలో గరిష్ఠ, కనిష్ఠ సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావం క్రమంగా తగ్గి.. జులైలో లానినో పరిస్థితులు 60 శాతానికి చేరుకుంటాయని, మధ్య ఈక్విటోరియల్ పసిఫిక్ జలాలు ఒక్క డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో చల్లబడతాయని ఆయన వెల్లడించారు. గత 25 సంవత్సరాల కాలంలో 20 ఏళ్లలో జులైలో వర్షపాతం సాధారణం లేదా అంతకు మించి నమోదయ్యిందని తెలిపారు.


‘‘ఈఏడాది రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించినా తగినన్ని అల్పపీడనాలు ఏర్పడకపోవడంతో మందకొడిగా విస్తరిస్తూ వచ్చాయి.. జూన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసింది.. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా 11% లోటు జూన్‌లో నమోదైంది. 2001 తర్వాత లోటు వర్షపాతం కురువడం ఇది ఏడోసారి. కేరళలోకి రుతుపవనాలు అనుకున్న సమయానికే వచ్చి, మహారాష్ట్ర వరకు త్వరగా విస్తరించి.. ఆ తర్వాత మాత్రం నెమ్మదించడంతో పలు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగింది.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే 14 శాతం అధికంగా వర్షాలు పడినా మిగిలిన అన్నిచోట్లా లోటు నెలకొంది. ఎక్కువకాలం పాటు వడగాలులు కొనసాగాయి’ అని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర తెలియజేశారు.


‘సాధారణ కంటే ఎక్కు వర్షపాతం వల్ల వ్యవసాయం, జలవనరులకు ప్రయోజనం కలుగుతుంది.. ఇదే సమయంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఉపరితల రవాణాకు ఆటంకం, ప్రజారోగ్యానికి సవాళ్లు, పర్యావరణ వ్యవస్థకు నష్టం జరుగుతుంది.. ఈ నష్టాలను సమర్థవంతంగా నివారించి.. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఐఎండీ ముందస్తు హెచ్చరికలు, సూచనలు పాటించడం, నిఘా, పరిరక్షణ ప్రయత్నాలను మెరుగుపరచడం, ప్రమాదాలు ఉన్న రంగాలలో బలమైన ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయడం చాలా అవసరం’’ అని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com