ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ నుంచి చెన్నై వెళ్లేవారికి షాక్.. ఈ బస్సులకు నో ఎంట్రీ, అక్కడి వరకే అనుమతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 08:16 PM

ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా తెలంగాణ నుంచి తమిళనాడు వైపు వెళ్లే బస్సులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రావెల్స్ బస్సుల్ని తమిళనాడులోకి అనుమతించడం లేదు.. దీంతో ఆ బస్సుల్లో వచ్చిన ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల పర్మిట్లపై నడిచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై సీరియస్‌గా ఉంది. అందుకే ఆ బస్సుల్ని తమిళనాడులోకి అనుమతించడం లేదు. దీంతో ఆ బస్సుల్లో వచ్చిన ప్రయాణికుల్ని ట్రావెల్స్ యాజమాన్యాలు.. తడ నుంచి చెన్నైకి పికప్‌ వ్యాన్లలో తీసుకెళుతున్నారు.


తమిళనాడు రాజధాని చెన్నై నుంచి తడ మీదుగా హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు దాదాపు 75కు పైగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులకు ఆలిండియా పర్మిట్‌ ద్వారా కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ బస్సుల పేరుతో.. ఎక్కడైనా ప్రయాణించే అవకాశం ఉంటుంది. కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధలోని ట్రావెల్స్ బస్సులు ఆయా రాష్ట్రాల పర్మిట్లు తీసుకోవడం లేదు. ఈశాన్య రాష్ట్రాల పర్మిట్లతో ఈ బస్సుల్ని నడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో పర్మిట్‌ పన్నుల వసూళ్లు చాలా తక్కువగా ఉండటంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు తెలివిగా ఈ పనిచేస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవవంగా మూడు నెలలకు.. ఒక బస్ససు సీట్‌కు సుమారుగా రూ.3,500 వరకు పర్మిట్ చెల్లించాల్సి ఉంటుంది.‌ తమిళనాడులో అయితే సుమారుగా రూ.3,200 చెల్లించాలి. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఒక సీట్‌కు పర్మిట్ కోసం కేవలం రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. అందుకే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు అక్కడ పర్మిట్లు తెచ్చుకుంటున్నారు.. అంతేకాదు ఆ రాష్ట్రాల్లో తనిఖీ కూడా ఉండదు. బస్సులు ఎక్కడో ఉన్నా సరే కొందరు మధ్యవర్తుల ద్వారా ఈజీగా ఆయా రాష్ట్రాల పర్మిట్లు ఇట్టే దొరికేస్తున్నాయి. అందుకే ఏపీలో 40 సీట్ ఉన్న ఒక బస్సుకు 3 నెలల కాలానికి సుమారు రూ.1.40 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే బస్సు ఈశాన్య రాష్ట్రంలో కేవలం రూ.16వేలు చెల్లిస్తే చాలు పర్మిట్‌ ఇస్తారు. అంటే ఈ రెండింటికి మధ్య తేడా ఏకంగా లక్షకుపైగా ఉంది.


అందుకే తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి బస్సులపై చర్యలు మొదలుపెట్టింది. చెన్నై నుంచి తెలుగు రాష్ట్రాలకు వెళ్లినట్లుగానే.. తమిళనాడులోని వివిధ ప్రాంతాలతోపాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వందల సంఖ్యలో ప్రైవేట్‌ బస్సులు నడుస్తున్నాయి. ఈ మధ్య ఒడిశా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి పర్మిట్ పొందిన బస్సులపై తమిళనాడు ప్రభుత్వం వరుసగా కేసులు నమోదు చేసింది. అక్కడితో ఆగకుండా కచ్చితంగా తమిళనాడు పర్మిట్ కూడా పొందాలని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా తెలివిగా.. చెన్నై నుంచి తడ మీదుగా నడిచే ఈ ప్రైవేట్‌ బస్సులను తడ దగ్గర ఆపేస్తున్నారు. అక్కడి నుంచి పికప్‌ వ్యాన్ల ద్వారా ప్రయాణికులను అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తరలిస్తున్నారు.


గత మార్చి నెలలో ఏపీలో రవాణాశాఖ చెక్‌పోస్టులను ప్రభుత్వం మూసివేసింది. చెక్‌పోస్టుల్లో వాహనాలు తనిఖీ చేసే అధికారులు లేకపోవడంతో.. ఇదే అదునుగా కొన్ని వాహనాలు పర్మిట్లు లేకుండానే రాష్ట్రంలోకి రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేకాదు ఏపీలోకి పర్మిట్లు లేని పికప్‌ వ్యాన్లలో ప్రయాణికులను తడ-చెన్నైల మధ్య తరలిస్తున్నారనే విమర్శ కూడా మొదలైంది. మొత్తం మీద ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పర్మిట్ల వ్యవహారం తమిళనాడులో ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com