ఢిల్లీలో ఎన్డీఏ పక్ష నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంలో నేడు(బుధవారం) సమావేశం అయిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి భాగస్వామ్య పక్షాలు తమ మద్దతును ఇచ్చాయి. అయితే ఈనెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మళ్లీ 7వ తేదీన ఢిల్లీకి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 7న బీజేపీ పార్లమెంటరీ సమావేశం తర్వాత ఎన్డీఏ భేటీ జరుగనున్నది. ఎన్డీఏ భేటీకి కూటమిలో ఎంపీలు అంతా హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని నేతలు కోరనున్నారు. ఈనెల 9వ తేదీన ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.