పార్వతీపురం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర గతంలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఏపీ, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో ప్రజలకు సేవలు అందించారు. అయితే తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన త్వరలో అసెంబ్లీకి వెళ్లనున్నారు. సాలూరు నుంచి పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో ఆమె తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు. కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి, పాలకొండ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన నిమ్మక జయకృష్ణ కూడా తొలిసారిగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. కాగా జయకృష్ణ తండ్రి గోపాలరావు కొత్తూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గతంలో ప్రజలకు సేవలు అందించారు. కురుపాం ఎమ్మెల్యేగా ఎన్నికైన జగదీశ్వరి తాత కూడా ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. రాజకీయ ప్రాతినిధ్యం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన సంధ్యారాణి, జయకృష్ణ, జగదీశ్వరి తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.