జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వానికి చరమ గీతం పాడేలా నామినేషన్ వేశానని తెలిపారు. ప్రజలు తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికలు కీలకమైనవని చెప్పారు. ఏపీ ప్రయోజనాలు ఆశించి తెలుగుదేశం- బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. ఈ పొత్తుల వల్ల జనసేనలో బలమైన నేతలకు ఈ ఎన్నికల్లో త్యాగాలు తప్పలేదన్నారు. 30 చోట్ల తమ అభ్యర్థులను విత్ డ్రా చేసుకోవాలని చెప్పానని.. తన మీద ప్రేమతో వారు వెనక్కి తగ్గారని అన్నారు. ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న టీడీపీ నేత వర్మ తన కోసం సీటు త్యాగం చేశారని గుర్తుచేశారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకు సముచిత స్థానం కల్పించేలా ప్రయత్నిస్తానని మాటిచ్చారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి గెలవబోతుందని జోస్యం చెప్పారు. మీడియాను ప్రభుత్వం అణచివేసిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంతో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.