కడప జిల్లా అంటే తొలుత గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. వైఎస్ అంటే కడప.. కడప అంటే వైఎస్.. అనేలా యెడుగూరి సందిటి ఫ్యామిలీ ఆ జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేసింది. వైఎస్ తర్వాత ఆయన వారసుడిగా వైఎస్ జగన్.. జిల్లా మీద తన కుటుంబం పట్టును కొనసాగిస్తున్నారు. ఇక ఆవిర్భావం నుంచి కడప జిల్లాలో తనదైన ముద్ర వేయని టీడీపీ ఈసారైనా సత్తాచాటాలని భావిస్తోంది. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. రాయలసీమలో టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం కాగా.. అనంతపురం జిల్లాలో రెండు, చిత్తూరులోని కుప్పంలో మాత్రమే సైకిల్ పార్టీ గెలుపొందింది. ఇక కడప, కర్నూలు జిల్లాలు రెండింటిలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
కడప ఎంపీ సీటుతో పాటుగా కడప, మైదుకూరు. బద్వేలు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. 2024 ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలను పునరావృతం చేయాలని కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్త సురేష్ బాబు వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ వైపు నుంచి చూస్తే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి జిల్లాలో టీడీపీని ఉనికిని బలంగా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు,
కడప లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఆరింటిలో బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థులు హ్యాట్రిక్ విజయం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పులివెందుల నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప నుంచి అంజాద్ బాషా, మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి, బద్వేలు నుంచి డాక్టర్ దాసరి సుధ, ప్రొద్దుటూరు నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఇక కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం బరిలో నిలిచారు.
కడప అసెంబ్లీ స్థానానికి వైసీపీ నుంచి అంజాద్ బాషా బరిలో ఉండగా.. టీడీపీ నుంచి శ్రీనివాసులురెడ్డి సతీమణి మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి అఫ్జల్ ఖాన్ పోటీ చేస్తున్నారు. వైసీపీ కార్యదర్శిగా ఉన్న అఫ్జల్ ఖాన్ ఇటీవలే వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డికి సొంత పార్టీ నుంచి సహకారం కాస్త తక్కువగా ఉంది. టికెట్ ఆశించిన ఆమిర్ బాబు. లక్ష్మి రెడ్డి వంటి నేతల నుంచి అంతగా మద్దతు లభించడం లేదనే ప్రచారం జరుగుతోంది.
మైదుకూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి వైసీపీ నుంచి రఘురామిరెడ్డి.. టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తు్న్నారు. అయితే వైసీపీ అభ్యర్థికి స్థానిక మున్సిపల్ ఛైర్మన్ చంద్ర నుంచి అంతగా సపోర్ట్ దొరకడం లేదని భోగట్టా. ఇక టీడీపీ నుంచి వరుసగా మూడోసారి పోటీచేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్.. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. బద్వేల్ నుంచి వైసీపీ తరుఫున డాక్టర్ సుధ పోటీ చేస్తున్నారు. ఈమెకు మాజీ ఎమ్మెల్సీ గోవింద రెడ్డి మద్దతుగా నిలుస్తుండగా.. టీడీపీ నేత విజయమ్మ మద్దతుగా బీజేపీ తరుఫున బొజ్జ రోషన్న బరిలో ఉన్నారు.
ప్రొద్దుటూరులో రాజకీయం మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ గురుశిష్యులు ప్రత్యర్థులుగా మారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి శివప్రసాద్ రెడ్డి.. టీడీపీ నుంచి వరదరాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నుంచి అనుకున్నంత సహకారం లభించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే వైసీపీ అసంతృప్త నేతలు శివచంద్రారెడ్డి. బాబు వంటి నేతలు.. టీడీపీలో చేరడం ఆయనకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఇక టీడీపీ నేత వరదరాజులరెడ్డి సైతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. టీడీపీలోని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గం, ఇంఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం నుంచి ఆయనకు ఆశించినంత సహకారం లభించడం లేదు.
ఇక జమ్మలమడుగు విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికే వైసీపీ మరోసారి టికెట్ ఇచ్చింది. కూటమి తరుఫున బీజేపీ నుంచి ఆదినారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే సుధీర్ రెడ్డికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నుంచి ఆశించినంత సహకారం లభించడం లేదని టాక్. కమలాపురంలో వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తుండగా .. టీడీపీ నుంచి పుట్టా చైతన్యరెడ్డి బరిలో ఉన్నారు. అయితే టీడీపీ నేత సాయినాథ్ శర్మ వైసీపీలో చేరటం టీడీపీ కాస్త ప్రతికూలంగా మారింది.
ఇక పులివెందుల సంగతికి వస్తే.. వైఎస్ జగన్‍కు భారీ మెజారిటీ కట్టబెట్టాలని వైసీపీ శ్రేణులు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో సుమారు 96 వేల ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపొందారు. ఈ సారి అంతకుమించి ఉండాలని పులివెందుల వైసీపీ శ్రేణులు పట్టుదలగా ఉన్నాయి. పులివెందులలో టీడీపీ నుంచి బీటెక్ రవి.. వైఎస్ జగన్‌ను ఢీకొడుతున్నారు. అయితే ఆయనకు కూడా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి నుంచి ఆశించినంత సహకారం లభించడం లేదని వార్తలు వస్తున్నాయి.