ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మస్క్ మద్దతు.. అమెరికా స్పందన ఇదే

national |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 09:58 PM

భద్రతా మండలి (యుఎన్‌ఎస్సీ)తో సహా ఐక్యరాజ్యసమితి సంస్థల సంస్కరణలకు అమెరికా మద్దతునిచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు. బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఐరాస భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం గురించి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన గురించి వేదాంత్ పటేల్ స్పందించారు. ‘అధ్యక్షుడు జో బైడెన్ ఐరాస సాధారణ సభలో చేసిన ప్రసంగంలో దీని గురించి ఇంతకు ముందు మాట్లాడారు.. మా కార్యదర్శి కూడా దీనిని ప్రస్తావించారు. మేము జీవిస్తున్న 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా భద్రతా మండలితో సహా ఐరాస సంస్థలకు సంస్కరణలకు మేము ఖచ్చితంగా మద్దతిస్తాం... దానికి సంబంధించి నా దగ్గర ఎలాంటి ప్రత్యేకతలు లేవు.. కానీ ఖచ్చితంగా మేము దానిని గుర్తించాం.. సంస్కరించాల్సిన అవసరం ఉంది, కానీ ప్రస్తుతానికి నేను దాని గురించి ఇంతకంటే ఏం మాట్లాడను’ అని వ్యాఖ్యానించారు.


ఈ ఏడాది జనవరిలో భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం నిజంగా హాస్యాస్పదమని మస్క్ అన్నారు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పించారు. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. భద్రతా మండలిలో ఏ ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, 80 ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పటికీ కొనసాగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.


ఈ పోస్ట్‌కు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మైఖెల్‌ ఐసెన్‌బర్గ్‌ బదులిస్తూ.. ‘మరి భారత్‌ సంగతేంటీ?’ అని ప్రశ్నించారు. దీనిపై మస్క్ ట్వీట్ చేశారు. ‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం.. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అని మస్క్ అభిప్రాయపడ్డారు. ఐరాస భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా.. వీటిలో చైనా, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్‌లు శాశ్వత సభ్యదేశాలు. తాత్కాలిక సభ్య దేశాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికవుతాయి. శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంటుంది. గత కొన్నేళ్లుగా భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com