ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హమాస్‌తో యుద్ధం.. ఇజ్రాయేల్‌కు 6 వేల మంది భారతీయ కార్మికులు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 09:49 PM

హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయేల్‌ నిర్మాణ రంగాన్ని తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆ దేశం ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా భారత్‌ నుంచి 6,000 మంది కార్మికులు అక్కడికి వెళ్లనున్నారు. ఏప్రిల్‌, మేలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరిని ఇజ్రాయేల్‌కు తరలించనున్నారు. వీరి ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని నెతన్యాహు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు బుధవారం రాత్రి ఇజ్రాయేల్‌ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.


స్థానిక కార్మికుల కొరత ఉన్నచోట ఇజ్రాయేల్ నిర్మాణరంగం విదేశీయులను నియమించుకుంటోంది. ఇప్పటి వరకు పాలస్తీనా అధీనంలోని వెస్ట్‌ బ్యాంక్‌ నుంచి 80,000, గాజాకు చెందిన 17,000 మంది కార్మికులు ఇజ్రాయేల్‌లో పనిచేస్తుండేవారు. కానీ, తాజాగా ఘర్షణల నేపథ్యంలో వారికి పని అనుమతిని రద్దు చేసిన ఇజ్రాయేల్.. భారత్‌ సహా పలు దేశాల నుంచి కార్మికులను ఆ స్థానాల్లో ఆహ్వానిస్తోంది. హమాస్‌తో పోరు మొదలైన తర్వాత కార్మికుల కొరతతో ఇజ్రాయేల్‌లో అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయి. ఫలితంగా ఉపాధి కోల్పోయి జీవన వ్యయాలు పెరిగి, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అటు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది.


ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు బుధవారం వివిధ వర్గాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం విదేశీ కార్మికుల తరలింపు నిర్ణయం వెలువడింది. భారత్‌-ఇజ్రాయేల్‌ మధ్య ఒప్పందంలో భాగంగానే మన దేశం నుంచి కార్మికులను తీసుకెళ్లనున్నారు. గతకొద్ది నెలల్లో దాదాపు 900 మంది కార్మికులు భారత్‌ నుంచి ఇజ్రాయేల్‌‌కు తరలివెళ్లినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతవారం కూడా 64 మంది భారతీయులు అక్కడికి చేరుకున్నారు.


ప్రాథమిక పరీక్షల అనంతరం ఇజ్రాయెలీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ భారత్, శ్రీలంకలకు చెందిన దాదాపు 20,000 మంది కార్మికులకు అనుమతులు ఇచ్చిందని అక్కడి నిర్మాణ రంగం తెలిపింది. వారిలో ఇప్పటి వరకూ కేవలం వెయ్యి మంది మాత్రమే అక్కడికి చేరుకున్నట్లు పేర్కొన్నాయి కానీ, వివిధ రకాల అనుమతులు, అధికారిక డాక్యుమెంట్ల విషయంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఎంపికైన వారిలో చాలా మంది పాత ఉద్యోగాలను వదిలిపెట్టి వేచిచూస్తున్నారని చెప్పారు.


డిసెంబర్‌లో నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇజ్రాయేల్‌కు వచ్చే భారత కార్మికులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌, శ్రీలంకకు చెందిన 7,000 మంది, చైనా, తూర్పు ఐరోపా దేశాల నుంచి మరో 6 వేల మంది ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 18,000 మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది కేర్‌గివర్‌గా ఉన్నారు. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. తమ భద్రతకు ఎలాంటి ముప్పు లేకపోవడం, ఆకర్షణీయమైన వేతనాల నేపథ్యంలో వారంతా అక్కడే కొనసాగుతున్నారు.


గతేడాది మే నెలలో ఇజ్రాయేల్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో నిర్మాణ రంగంలో 34,000 మంది, నర్సింగ్‌ విభాగంలో పనిచేసేందుకు 8 వేల మంది భారతీయులను అనుమతిస్తున్నట్టు తెలిపింది. దీనిపై భారత్‌తో విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఆరు నెలల్లో 800 మంది ఆ దేశ వ్యవసాయ రంగంలోనూ చేరారు. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గతవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు ప్రభుత్వాల మధ్య ఒప్పందంలో భాగంగా ఇజ్రాయేల్‌కు భారత కార్మికుల తొలి బ్యాచ్ వెళ్లనున్నారని చెప్పారు. ‘ఈ ఒప్పందం హమాస్-ఇజ్రాయేల్ సంఘర్షణకు ముందే జరిగింది... కార్మికుల భద్రత గురించి మేము ఆలోచించాం.. వారికి భద్రతకు ఎటువంటి ముప్పులేదని ఇజ్రాయేల్ భరోసా ఇచ్చింది’ అని అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com