ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో తెలంగాణను దాటేసిన ఏపీ.. జస్ట్ ప్రారంభమేనన్న షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 07:03 PM

ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ కాంగ్రెస్‌లో నూతనోత్తేజం వచ్చిందని చెప్పొచ్చు. జిల్లాల వారీగా పర్యటనలు, రాజన్న రచ్చబండలు, బహిరంగ సభలతో హస్తం పార్టీకి దూరమైన కాంగ్రెస్ శ్రేణులను మళ్లీ దగ్గరకు చేర్చే ప్రయత్నం షర్మిల చేస్తున్నారు. మొన్నటి వరకూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వైఎస్ఆర్ సన్నిహితులు, పాతతరం కాంగ్రెస్ నేతలను సైతం మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేలా చేస్తున్నారు వైఎస్ షర్మిల. రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్ వంటి నేతలు తిరిగి రాజకీయాల్లో కనిపించడానికి షర్మిలే కారణం. ఇదే సమయంలో బహిరంగసభలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల.. బహిరంగసభలలోనే అభ్యర్థులను సైతం ప్రకటిస్తున్నారు. మొన్న పాడేరులో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని షర్మిల ప్రకటించారు.


ఇక ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి. కానీ తాజాగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలలో పోటీకి దరఖాస్తులు ఆహ్వానిస్తే వేయిమంది వరకూ అప్లై చేసుకున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దరఖాస్తు గడువును కూడా కాంగ్రెస్ పార్టీ మరో 20 రోజులు పొడిగించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల సారథ్యంలోని ఏపీ కాంగ్రెస్ పార్టీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు. మణిపూర్‌లో ప్రారంభమైన ఈ యాత్ర తూర్పు నుంచి పడమరవైపుగా సాగుతోంది. అయితే న్యాయ్ యాత్ర నిర్వహణ కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తోంది. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, హస్తం పార్టీ మద్దతుదారులు, అభిమానులు రాహుల్ యాత్ర కోసం విరాళాలు అందిస్తున్నారు. అయితే న్యాయ్ యాత్రకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏపీ నుంచి అత్యధిక విరాళాలు అందడం విశేషం. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.


న్యాయ్ యాత్రకు విరాళాలు అందించడంలో దేశాన్ని లీడ్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని అభినందనలు అంటూ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. ఏపీ నుంచి బలమైన సపోర్ట్ అందిందనీ.. ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్లిన వైఎస్ షర్మిలకు అభినందిస్తున్నట్లు మాణిక్కం ఠాగూర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మరోవైపు మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వైఎస్ షర్మిల.. న్యాయ్ యాత్రకు విరాళాలు అందించడంలో సహకరించి, జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని విశ్వసిస్తున్నారని, ఆ పార్టీని ఆశాకిరణంగా చూస్తున్నారనే దానికి ఇదే నిలువెత్తు నిదర్శనం అన్న షర్మిల.. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఏపీ కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.


విరాళాల సంగతికి వస్తే.. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఏపీ నుంచి అత్యధికంగా కోటి రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయి. రాజస్థాన్ నుంచి 86 లక్షలు, హర్యానా నుంచి 74 లక్షలు, మహారాష్ట్ర నుంచి 41 లక్షలు, కర్ణాటక నుంచి 33 లక్షల రూపాయలు విరాళాలు అందాయి. ఇక్కడో విషయాన్ని గమనిస్తే టాప్‌ 5లో తెలంగాణ లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా 33 లక్షల రూపాయల విరాళాలు అందడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com