వీకెండ్ వస్తే చాలా మంది ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. అందుకు దగ్గర్లో ఉండే మంచి టూరిస్ట్ స్పాట్ వెతుక్కుంటారు. తెలంగాణలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు పర్యాటకలు బారులు తీరుతుంటారు. అయితే హైదరాబాద్ నగరానికి అతి దగ్గర్లో ఉన్న పర్యాటక కేంద్రాల్లో లక్నవరం ఒకటి. ములుగు జిల్లాలో గోవిందరావుపేట మండలంలో బుస్సాపూర్ శివారులో లక్నవరం లేక్ ఉంటుంది.
లక్నవరం జలాశయంలో ఇప్పటికే రెండు ద్వీపాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతుండగా.. తాజాగా మూడో ద్వీపం ముస్తాబైంది. లక్నవరం జలాశయంలో సుమారు ఎనిమిదెకరాల విస్తీర్ణంలో మూడో ఐలాండ్‌ను టీఎస్‌టీడీసీ, ఫ్రీ కోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అద్భుతంగా అభివృద్ధి చేశారు. పర్యాటకుల ఆహ్లాదానికి ప్రాధాన్యమిస్తూ ఐలాండ్‍లో పచ్చని ఉద్యానవనాలను అందంగా తీర్చిదిద్దారు. మూడో ఐలాండ్‌లో మొత్తం 22 కాటేజీలుండగా, అందులో నాలుగింటిని కుటుంబసభ్యులతో బస చేసేందుకు వీలుగా అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఐదు స్విమ్మింగ్ ఫూల్స్‌లో.. నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలను కనెక్ట్ చేస్తూ నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేకమైన ఈతకొలను, ఆట వస్తువులను సైతం అందుబాటులో ఉంచారు. మూడో ఐలాండ్‌లో పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంటు తదితర సౌకర్యాలు కల్పించారు. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మాల్దీవులు, మున్నార్, శిమ్లా తదితర ప్రాంతాలను తలపించేలా ఈ ఐలాండ్ సుందరీకరించారు. ఫ్రీ కోట్స్‌కు చెందిన సుమారు 40 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. దీన్ని త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
హైదరాబాద్ 210 కి.మీ వరంగల్ సిటీ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో లక్నవరం లేక్ ఉంటుంది. దట్టమైన అడవుల మధ్య కొండల నడుమ ఈ సరస్సు ఏర్పడింది. ఇది ప్రకృతి సౌందర్యాలకు నిలయంగా నిలుస్తుంది. లక్నవరం లేక్ కాకతీయుల కాలం నాటిది. చరిత్ర ప్రకారం చూస్తే.. ఈ సరస్సును కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తవ్వించాడు. ఈ సరస్సు చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున లక్నవరం వస్తారు. లక్నవరం సరస్సులో ద్వీపాలతో పాటుగా కేబుల్ బ్రిడ్జిలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.