హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, కుంటలను కాపాడేందుకు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రాపై హైకోర్టులో మరో కేసు పడింది. హైడ్రాకు విశేష అధికారాలను కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని.. మాజీ కార్పొరేటర్, పిటిషనర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. తాజాగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. తాజాగా నోటీసులు ఇచ్చింది.
హైడ్రా ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్, హైడ్రాకు విస్తృత అధికారాలు ఇవ్వడం చట్టవిరుద్ధం అని పిటిషనర్ వాదించారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా ఆర్డినెన్స్ సస్పెన్షన్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.
హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు ఇటీవలె గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కల్పించారు. దీంతో హైడ్రా తీసుకునే అన్ని చర్యలకు చట్టబద్ధత లభించినట్లయింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అప్పటివరకు హైడ్రా కోసం ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.
హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు, పార్కులు సహా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను రక్షించడం.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు పడినపుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం.. ఫైర్ డిపార్ట్‌మెంట్ సేవలకు ఎన్‌వోసీ జారీ చేయడం సహా పలు లక్ష్యాలతో జులై 19వ తేదీన జీవో ఎంఎస్‌నం 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్‌ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి చేర్చింది. మరోవైపు.. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా.. ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు కట్టబెట్టారు.