ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముత్యాలమ్మ ఆలయ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:55 PM

ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని.. కానీ, తెలంగాణ సమాజం అలాంటి వాటిని ప్రోత్సహించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్‌గా స్పందించారు. ప్రజల్లో విభేదాలు సృష్టించాలనే సంఘ వ్యతిరేక శక్తుల చర్యలను నియంత్రించడంలో ప్రభుత్వం పోలీసులకు పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించేవారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లో విగ్రహాల ధ్వంసం ఘటనలలో నిందితుల మానసిక స్థితి ఆధారంగా వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


‘తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అదేవిధంగా ఎవరో తప్పు చేశారని, వాళ్లను తామే శిక్షిస్తామని కొందరు శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకుంటే.. అలాంటి సందర్భాల్లో తప్పు చేసిన వారికి, చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్న వారికి మధ్య తేడా లేకుండా పోతుంది. తప్పు చేసే వారెవరైనా పోలీసులు కఠినంగా వ్యవహరించాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


సోమవారం (అక్టోబర్ 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గోషామహల్‌లో నిర్వహించిన ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం అమరులైన పోలీసుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం ప్రసంగిస్తూ.. ఏ రాష్ట్రమైనా ప్రగతి పథం వైపు నడవాలంటే శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత కీలకమని చెప్పారు.


శాంతి భద్రతలు, మత సామరస్యం కాపాడినప్పుడే మన పండుగలను గొప్పగా నిర్వహించుకోగలమని ముఖ్యమంత్రి అన్నారు. కొన్ని సందర్భాల్లో ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ పోలీసులు హైదరాబాద్ నగరంలో మత సామరస్యాన్ని కాపాడటంలో ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. ‘శాంతి భద్రతలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బాధితుల విషయంలో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలే తప్ప, క్రిమినల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.


చెప్పులు విసరడం వల్లే లాఠీఛార్జ్ చేశాం


మరోవైపు.. ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆందోళనకారులపై లాఠీఛార్జ్ ఘటనపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై మరికొన్ని వీడియోలను బయటపెట్టారు. ఆందోళనకారులు తొలుత తమపై చెప్పులు, రాళ్లు విసరడం.. కర్రలతో దాడి చేయడం వల్లే లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.


‘బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్‌’ అంటూ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. ఆ ఘటన వెనుక అసలు వాస్తవాలు ఇవేనంటూ హైదరాబాద్ పోలీసులు వీడియోలను విడుదల చేశారు. ఆందోళనకారుల ఆవేశపూరిత చర్యల వల్లే వారిపై లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com