ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి,,,న్యూజెర్సీలో బోనాల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 08:27 PM

న్యూజెర్సీలోని తెలుగు ప్రజలు తెలంగాణ సంప్రదాయమైన బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో.. "న్యూజెర్సీ బోనాల జాతర" పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళీ బోనాలను.. ఆదివారం (జులై 27వ తేదీన) న్యూజెర్సీలోని.. ఓం శ్రీ సాయి బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్‌లో కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం మూడున్నర వరకు బోనాల జాతరను ఎంతో కోలాహలంగా జరిపించారు టీటీఏ నిర్వాహకులు. ఈ ఉత్సవాలకు 500 గా పైగా అతిథులు విచ్చేసి, ఈ తెలంగాణా పల్లె పండుగను ఉత్సాహంగా, భక్తితో వినూత్నంగా జరుపుకొన్నారు.


ఉదయం 12 గంటలకు ప్రారంభమైన అమ్మవారి ఊరేగింపు.. డప్పు వాయిద్యాలు, పోతరాజు విన్యాసాల నడుమ బోనాలను తలపై ఎత్తుకుని మహిళలంతా గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం.. అమ్మవారికి మొక్కులు చెల్లించునకున్నారు. ఇందులో.. టీటీఏ నిర్వాహకులు సమర్పించిన వెండి బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ శర్మ.. అమ్మవారికి పూజాదికాలు నిర్వహించి.. బోనాల విశిష్టతను అందరికీ విడమరిచి వివరించారు.


ఈ సంబురాల్లో చిన్నా పెద్దా అందరూ పాల్గొని ఎంజాయ్ చేశారు. తెలంగాణ బోనాల పాటలకు చిందులేశారు. ఈ వేడుకల్లో పోతురాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్ నుంచి రప్పించిన బిక్షుయాదవ్‌.. పోతురాజు వేషధారణలో చిందులతో విన్యాసాలు చేస్తూ.. అందరినీ అలరించారు. అచ్చమైన బోనాల జాతర వాతావరణాన్ని తలపించేలా తన నృత్యంతో పాటలతో అందరిలో భక్తిని పారవశ్యంలో మునిగేలా చేశారు .


ఈ కార్యక్రమంలో.. అడ్వైజరీ కౌన్సిల్ కో ఛైర్ పర్సన్ డాక్టర్ మోహన్ రెడ్డి పటాలోళ్ల, జాయింట్ సెక్రరెటరీ శివారెడ్డి కొల్ల, బీఓడీ సుధాకర్ ఉప్పల, నర్సింహా పెరుక, నరేంద్ర యరవ, RVPలు సాయి గుండూర్, మధుకర్ రెడ్డి తో పాటు ఆర్గనైజింగ్ బృంద సభ్యులంతా సపరివారంగా వేడుకల్లో పాల్గొన్నారు.ఓం శ్రీ సాయి బాలాజీ మందిరం స్థాపకులు శ్రీ సూర్య నారాయణ మద్దుల గారు, అందరనీ సహృదయంతో ఆహ్వానిస్తూ, మందిరం గురించి వివరించారు. మందిరం కార్యనిర్వాహక వర్గం సభ్యులందరూ TTAకు చక్కటి సహకారం అందించారు.


ఈ బోనాల కోసం కావాల్సిన సామాగ్రిని ఇండియా నుంచి అతితక్కువ సమయంలో న్యూజెర్సీకి తీసుకురావటంలో నర్సింహా కృషి చేశారు. ఇక.. అతిథులను ఆహ్వానించటమే కాదు.. కార్యక్రమాన్ని ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగటంలో శివ తన పాత్ర పోషించారు. ఇక.. ఆలయ నిర్వాహకులతో సుధాకర్ సమన్వయం చేసుకున్నారు. ఇక పూజకు సంబంధించిన సామాగ్రిని.. లోకల్‌గా ఉన్న వేరు వేరు స్టోర్ల నుంచి శ్రీని సేకరించారు.


మరోవైపు.. అరుణ్ ఆర్కాల, ప్రశాంత్ నలుబంధు, శ్రీనివాస్ రెడ్డి మాలి, నవీన్ కోలురు, రాజా నీలం, శ్రీనివాస్ జక్కిరెడ్డి, వెంకీ, సాయిరామ్ గాజుల, అనుదీప్, రఘు బృందం.. తొట్టేలు సిద్ధం చేయటంలో, భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి కృషి చేశారు. వీళ్లే కాకుండా.. టీటీఏ మహిళా బృందం.. శైలజా పట్లోళ్ళ, దీపా జలగం, వాణి పెరుక, కవిత యరవ, నవ్య రెడ్డి, లలిత రెడ్డి గార్లతో పాటు పలువురు మహిళల సహాకారంతోనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది. న్యూజెర్సీలో ఉన్న తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంబురాల్లో పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేశారు. RVP లు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బోనాల జాతరకు వందలాదిగా వచ్చి పండుగను దిగ్విజయం చేసినవారందరికీ టీటీఏ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com