ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ ఘర్ వాపసీ షురూ.. క్లారిటీ ఇచ్చిన ఆ ఎమ్మెల్యేలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 07:31 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ కండువా కప్పుకుండూ గులాబీ బాస్ కేసీఆర్‌కు షాకుల మీద షాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఎండలు తగ్గిపోయి వానలు మొదలైనట్టుగా.. ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మెల్లిగా ఇంటి బాట పడుతున్నట్టు సూచనలు అందుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. ఈరోజు తిరిగి సొంత గూటికి చేరుకోవటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. బండ్ల బాటలోనే మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మళ్లీ హస్తం దోస్తీకి కటీఫ్ చెప్పి బీఆర్ఎస్ కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.


కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి.. కొన్ని రోజుల్లోనే మనసు మార్చుకుని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల ఎపిసోడ్‌తో.. కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు కౌంటర్‌గా.. బీఆర్ఎస్ పార్టీ ఘర్ వాపసీకి తెరలేపినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బండ్లతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తిరిగి గులాబీ గూటికి చేరుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు ఇదిగో సాక్ష్యం అంటూ.. ఓ ఫొటోను కూడా బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


బీఆర్ఎస్‌ ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. లాబీలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డితో కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు ఈ విషయాన్ని బీఆర్ఎస్‌లోని అగ్ర నేతలు కూడా ధ్రువీకరిస్తుండటంతో.. ఘర్ వాపసీ వార్తలకు బలం చేకూరుతోంది.


ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తర్వాత కలిసి మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో మొదలైన చేరికల పర్వం.. తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇందులో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరుకోగా.. ఎంత మంది తిరిగి రానున్నారన్నది చూడాల్సి ఉంది.


అయితే.. ప్రస్తుతం వస్తున్న వార్తలను నమ్మబోవద్దంటూ సదరు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. అసెంబ్లీ లాబీలో సరదాగా కూర్చొని టీ తాగిన ఫొటోలను వైరల్ చేయటం సరికాదని తెల్లం వెంకట్రావ్ ఖండించారు. తాను పార్టీ మారట్లేదంటూ కాలే యాదయ్య కూడా ఆ వార్తలను ఖండించారు. అయితే.. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు కూడా ఇలాంటి స్టేట్‌మెంట్లే ఇవ్వగా.. సడెన్ షాకులిస్తూ పార్టీల్లో చేరారు. కాగా.. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు చెప్తున్న మాటలను పూర్తి నమ్మలేని పరిస్థితిలో కార్యకర్తలు ఉండటం గమనార్హం.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com