ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుపేద అంధునికి ఇల్లు కట్టించి ,,,,మానవత్వం చాటుకున్న మహబూబాబాద్ పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 28, 2024, 07:54 PM

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీసులు. పాటలు పాడుతూ పొట్టనింపుకుంటున్న నిరుపేద అంధునికి చేయూతగా నిలవటమే కాకుండా.. ఇంటిని నిర్మించి ఇచ్చారు. పెద్దనాగారం గ్రామానికి చెందిన మందుల నాగన్న పుట్టుకతోనే అంధుడు కావటం.. ఆయన తండ్రి కూడా మరణించటంతో తెలిసిన కళతో.. వచ్చిన పదో పరకతో తల్లిని పోషించుకుంటున్నాడు. అయితే.. తమకు ఉన్న ఇల్లు పాతదైపోయో.. ప్రకృతి వైపరిత్యాల వల్లనో.. పడిపోవడంతో తల్లితో కలిసి ఇంటి పక్కనే పరదాలతో చిన్న గుడారం ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తన తల్లి అస్వస్థతకు గురికావడంతో నాగన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.


నాగన్న పరిస్థితిని స్థానిక యువత వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అతని గురించి తెలుసుకున్న ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్.. నర్సింహులపేట ఎస్‌ఐ‌ ద్వారా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. నాగన్నకు ఇల్లు లేదని తెలిసి.. కూలిపోయిన అతడి ఇంటి స్థానంలోనే కొత్త ఇల్లు నిర్మాణం చేసేలా చొరవ తీసుకున్నారు. తమతో పాటు కొంత మంది దాతల సహకారంతో నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించి ఇచ్చారు. గృహ ప్రవేశానికి ఎస్పీ స్వయంగా హాజరై పూజా కార్యక్రమాలు చేశారు. అంతే కాదు.. తల్లీకొడుకులకు కొత్త బట్టలు పెట్టి సంప్రదాయబద్దంగా గృహప్రవేశం చేపించారు. అనంతరం.. ఇంటి ముందు ఒక మొక్కను కూడా నాటారు. నాగన్నకు ఎప్పటికీ తమ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.


పోలీసులు చొరవ తీసుకుని తనకు ఇల్లు కట్టించి ఇవ్వడం.. అందులోనూ ఎస్పీనే స్వయంగా గృహప్రవేశానికి హాజరుకావడంతో నాగన్న ఆనందానికి అవధుల్లేవు. ఆనందంతో స్వయంగా పాట పాడడమే కాకుండా.. సినిమా పాటలకు డాన్సులు కూడా వేశాడు. ఇక నాగన్నను ఆదుకున్న పోలీసులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. వారి చొరవకు జేజేలు కొట్టారు. ఏ చిన్న పని చేయాలన్న లంచాలు డిమాండ్ చేస్తూ.. రూల్స్ పేరుతో అమాయకపు జనాలపై బూతులతో పాటు బూటు కాళ్లతో తెగబడిపోతున్న పోలీసులు ఉన్న ఈ కాలంలో.. ఓ నిరుపేద అంధునికి తామే అండగా నిలబడి ఓ గూడు కట్టించటమనేది.. నిజంగా మెచ్చుదగిన విషయమే. హ్యాట్సాఫ్ మహబూబాబాద్ పోలీస్.. అంటున్నారు ప్రజలు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com