వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయాడనుకొని బంధవులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంతలోనే అందరికీ సడెన్ షాక్ ఇస్తూ.. సదరు వ్యక్తి బతికొచ్చాడు. దీంతో ఆశ్యర్యపోవటం స్థానికుల వంతైంది. పోగొట్టుకున్న ఫోన్ కారణంగా సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్‌కు చెందిన 45 ఏళ్ల ఎల్లప్ప పశువుల కాపరిగా జీవనం సాగించేవాడు. అయితే రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు.
ఇంతలో ఆదివారం (జూన్ 23) ఉదయం వికారాబాద్ రైల్వే పోలీసుల నుంచి ఎల్లప్ప కుటుంబ సభ్యులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. వికారాబాద్ స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని.. అతని వద్ద ఉన్న ఫోన్ ఆధారంతో మీకు ఫోన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు వికారాబాద్‌కు వెళ్లారు. రైలు ఢీ కొట్టడంతో ముఖం చిధ్రం కాగా.. మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇంతలో హఠాత్తుగా ఎల్లప్ప దర్శనమిచ్చాడు. దీంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులతో పాటు స్థానికులు అవాక్కయ్యారు.
ఎల్లప్ప బతికే ఉన్నాడని.. మరి చనిపోయిన వ్యక్తి ఎవరని పరేషాన్ అయ్యారు. షాక్ నుంచి తేరుకున్న స్థానికులు, బంధువులు ఎల్లప్పను ఎక్కడకి వెళ్లావని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. తాను రెండు రోజుల క్రితం తాండూరు చేరుకోగా.. అక్కడ ఓ వ్యక్తి తన వద్ద ఫోన్ కొట్టేసి పారిపోయాడని చెప్పాడు. అతడే ట్రైన్ కింద పడి చనిపోయి ఉండవచ్చునని తెలిపాడు. దీంతో గ్రామానికి తీసుకొచ్చిన శవాన్ని తిరిగి వికారాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు. మెుత్తానికి చనిపోయాడనుకున్న ఎల్లప్ప బతికిరావటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.