18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. లోక్సభ ప్రత్యేక సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తర్వాత సీనియారిటీ ప్రకారం మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు తెలుగు ఎంపీలు మాతృభాషలో ప్రమాణస్వీకారం చేశారు.
కొత్త లుక్లో పంచె కట్టుతో లోక్సభకు హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తెలంగాణకు చెందిన మరో కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు.. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత.. ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన లోక్సభ సభ్యులు ప్రమాణం చేశారు. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, బీజేపీ రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ పార్టీకి చెందిన అరకు ఎంపీ తనుజా రాణి హిందీ బాషాలో ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, తొలి రోజు మొత్తం 280 మంది ఎంపీలచే ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నేడు, రేపు రెండ్రోజుల పాటు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం జరగనుంది.
ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదంతో.. బీజేపీ ఆశీస్సులతో రెండోసారి లోక్సభలో పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడం ఆనందాన్నిచ్చిందన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు చిత్తశుద్ధి, అంకితభావం, నిబద్ధతతో సికింద్రాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాన్నారు. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తానని ట్వీట్ చేశారు.