ఎన్నో అద్భుతాలను కడుపులో దాచుకుంటుంది భూమి. బంగారం, వజ్రాలు ఇలా ఎంతో విలువైన సంపదతో పాటు అంతకంటే విలువైన, కాలంలో కలిసిపోయిన చరిత్రను కూడా తనలో భద్రంగా దాచుకుంటుంది. ఆయా సందర్భాల్లో ఆ అద్భుతాలను, చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను మన కంటికి కనిపించేలా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే నారాయణ్ ఖేడ్‌లో ఓ అద్భుతం బయటపడింది. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ మండంలోని హనుమంతరావిపేట గ్రామంలో బంజే సరోజ అనే మహిళా రైతు పొలంలో.. పురాతన వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. పొలంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడటంతో.. ఆ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.
అయితే.. సరోజ కుటుంబానికి హనుంతరావిపేట గ్రామంలోని.. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా పొలం ఉంది. ఆ పొలంలో వ్యవసాయం చేస్తూనే ఆ కుటుంబం జీవనం సాగిస్తున్నారు. కాగా.. ఎప్పటిలానే ఈ సారి కూడా సాగు కోసం.. భూమిని చదును చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ఆదివారం రోజున బేసీబీతో లెవల్ చేస్తుండగా.. భూమిలో నుంచి వెంకటేశ్వరుని పురాతన విగ్రహం బయటపడింది. ఈ పురాతన విగ్రహం పంచలోహ విగ్రహంగా గుర్తించారు. ఇది సుమారు రెండున్నర నుంచి మూడు కిలోల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ విషయం గ్రామస్థులకు తెలియజేయటంతో.. పొలంలో నుంచి బయట పడిన విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో.. ఈ విగ్రహాన్ని భక్తుల సందర్శనార్థం పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంచారు. మొత్తంగా ఈ ఘటన గురించి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
గతంలోనూ.. పొలాలు చదును చేస్తుండగా.. దున్నుతున్న సమయంలో.. భూమిలో నుంచి బంగారు, వెండి వస్తువులు కూడా బయటపడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల బంగారు నాణేలు ఉన్న లంకె బిందెలు కూడా కనిపించాయి. కొందరు రైతులకైతే ఏకంగా వజ్రాలు కూడా దొరకటం విశేషం. మరికొన్ని సందర్భాల్లో దేవుళ్ల విగ్రహాలు కూడా బయట పడిన ఘటనలు ఉన్నాయి. రాములోరి, నాగమ్మ, శ్రీకృష్ణుడి వంటి దేవుళ్ల విగ్రహాలు బయట పడ్డాయి.