ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు బిగ్ అలర్ట్.. రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. అయితే డైరెక్టుగా జైలుకే..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 09:42 PM

హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్ అలర్ట్. నగరంలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్‌ ను కంట్రోల్ చేసేందుకు.. అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. కఠిన నిబంధనలు కూడా పెడుతున్నారు పోలీసులు. నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు, కఠిన చర్యలతో ఇప్పటికే కొరడా ఝళిపిస్తున్నారు. అయితే.. ఇన్ని చర్యలు తీసుకున్నా.. కఠిన నిబంధనలు పెట్టినా.. కొందరు వాహనదారులు మాత్రం ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్న వారి వల్లే.. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా.. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. అందులోనూ.. రాంగ్ రూట్లలో వెళ్లే వారి వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గుర్తించిన పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.


ఇకపై ట్రాఫిక్ నిబంధనల విషయంలో మరింత కఠినంగా వ్యవహించేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యాక్షన్‌లోకి కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు.. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపేవారిని డైరెక్టుగా జైలుకు పంపించేందుకు సిద్ధమయ్యారు. రాంగ్ రూట్‌లో వెళ్లేవారిపై.. 336 సెక్షన్ కింద కేసు ఫైల్ చేస్తున్నారు. రాంగ్‌రూట్‌లో వచ్చి పట్టుబడిన వాహనదారులపై అండ్‌ ఆర్డర్‌ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటమే కాకుండా చార్జిషీట్‌ కూడా ఫైల్ చేస్తుండటం గమనార్హం.


ఈ క్రమంలోనే.. శుక్రవారం ఒక్కరోజే సైబరాబాద్‌ కమిషనరేట్‌ జోన్‌లో.. రాంగ్‌ రూట్‌‌లో వాహనాలు నడిపిన 93 మందిని గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అందులో 11 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయటం గమనార్హం. ఇందులో అత్యధికంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో.. 32 మంది వాహనదారులు రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడినవారిలో నలుగురు వాహనదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


మరోవైపు.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు పట్టుబడగా.. అందులో ఒకరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడపడం వల్ల వారికే కాకుండా.. సరైన దారిలో వెళ్లే వాహనదారులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. నిబంధనలు ఉల్లఘిస్తున్న వారిపై భారీగా జరిమానాలు వేసినా లాభం లేకుండా పోతుందని పోలీసులు చెప్తున్నారు. అందుకే.. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై సెక్షన్‌ 336 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో వాహనదారులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు.


రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపేవారిని ట్రాక్ చేసేందుకు.. ఆయా ప్రాంతాల్లో ఏఎన్‌పీఆర్‌ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో.. ఎవరెవరు రాంగ్ రూట్‌లో వెళ్తున్నారో, నిబంధనలను అతిక్రమిస్తున్నారన్నది పోలీసులకు ఇట్టే తెలిసిపోనుంది. కాబట్టి.. వాహనదారులారా బీ అలర్ట్.. రాంగ్ రూట్‌లో వెళ్లి జైలు పాలు కావటమో.. ప్రమాదాల బారిన పడటమో కాకుండా.. సక్రమమైన మార్గాల్లో వెళ్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని పోలీసులు కోరుకుంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com