తెలంగాణ అన్నదాతలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రైతులకు సంబంధించిన సంక్షేమ పథాకలే ప్రధాన ఎజెండాగా.. శుక్రవారం (జూన్ 21వ తేదీన) మధ్యాహ్నం భేటీ అయిన కేబినెట్లో ఈ మేరకు ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏక కాలంలో రైతు రుణామాఫీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. ఈ పంటల రుణమాఫీకి సుమారు 40 వేల కోట్లు అవసరమవుతాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రైతులకు 2 లక్షల రుణాల మాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేసింది. అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేయగా.. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15 లోపల పూర్తిగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో.. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఉద్ఘాటించిన విషయం తెలిసిందే.
అయితే.. ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే.. 2 లక్షల మేర పంట రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం ఏర్పటయిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఈ హామీపై ఓ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరు నెలల్లో.. రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించిన వివరాలు సేకరించే పనితో పాటు.. ఈ హామీని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను తయారు చేసే పనిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. కాగా.. మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు రావటంతో.. ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యమైందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి.
మరోవైపు.. రైతులకు సంబంధించిన రైతు భరోసా, పంటలకు మద్దతు ధర, పంటల బీమాకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే.. ఇందుకు సంబంధించిన నిర్ణయాలు, విధివిధానాలకు సంబంధించిన వివరాలను.. సీఎం రేవంత్ రెెడ్డి స్వయంగా ప్రకటించనున్నారు.