ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనుషులు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే: కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 09:15 PM

హరేకృష్ణ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎన్నో విలువైన సేవలు అందించారని కొనియాడారు. హైదరాబాద్‌ శివారు కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు సీఎం కేసీఆర్‌ ఇవాళ శంకుస్థాపన చేశారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో 400 అడుగుల ఎత్తుతో ప్రతిష్ఠాత్మకంగా ఈ టవర్‌ను నిర్మిస్తుండగా..భూమి పూజ అనంతరం శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మత మౌఢ్యం ప్రమాదకరమని మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని అన్నారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని వ్యాఖ్యనించారు. విశ్వశాంతి కోసం అందరం ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడేనని చెప్పారు.


ప్రశాంత సమాజం కోసం, విశ్వ శాంతి కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికీ తెలంగాణా ప్రభుత్వం మద్దతు ఇస్తుందని అన్నారు. సమస్యలతో కూడిన నగర జీవనంలో నిజమైన ప్రశాంతత భక్తి, భజన, ప్రార్ధనల వల్ల చేకూరుతుందని కేసీఆర్ వెల్లడించారు. ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చూడాలని, ఆలయాలు సామాజిక స్వాంతన కేంద్రాలని అన్నారు. అదే సమయంలో మౌఢ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేద సంస్కృతిని సరిగ్గా అర్ధం చేసుకుంటే విశ్వ శాంతినే బోధిస్తుందని అన్నారు.


ఇక హరేకృష్ణ ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలను సీఎం కొనియాడారు. అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయమని అన్నారు. హైదరాబాద్‌లో ధనవంతులు కూడా రూ.5 భోజనం తింటున్నారని తెలిపారు. ఎంతో చిత్తశుద్ధి, కార్యదక్షత ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని అన్నారు. కరోనా లాంటి కష్ట సమయంలో ప్రజలు ఆకలితో అలమటించారని.. అలాంటి సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్‌ గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించిందని ప్రశంసించారు. అన్ని ఆపద సమయాల్లోనూ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు.


హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇక్కడకు అందమైన ఆధ్యాత్మిక కేంద్రం వస్తోందని సీఎం వెల్లడించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించామని.. వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరంలో హరేకృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామన్న కేసీఆర్.. ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటించిన నిధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com