ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 22, 2021, 09:27 AM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈసారి బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల్లో రాష్ట్రంలో టీటీడీ ఇటీవల ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 500 నుండి 1000 మంది భక్తులను బస్సుల్లో ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని హెచ్ డీపీపీ, రవాణ విభాగం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద పారాయణంలో అర్హులైన వారికి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని అధికారులకు సూచించారు. అలాగే, ఈ బ్రహ్మోత్సవాల సమయంలోనే ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు ప్రారంభించేందుకు సిఈఓ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యంపై వసంత మండపంలో ప్రముఖ పండితుల చేత ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.


 


నాదనీరాజనం వేదికపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఇతర వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన ఇంజినీరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. అలిపిరి కాలినడక మార్గాన్ని బ్రహ్మోత్సవాల లోపు భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మరమ్మతులు పూర్తయిన కాటేజీలను భక్తులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాహనసేవలు జరిగే ప్రాంతమైన ఆలయంలోని కల్యాణమండపంలో చిన్న బ్రహ్మరథం ఏర్పాటు చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు వాహనసేవలకు వినియోగించే వివిధ వాహనాల పటిష్టతను పరిశీలించి లోటుపాట్లను సరి చేయాలన్నారు.


 


బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తులకు, విఐపిలకు ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని భద్రతా విభాగం, పోలీసు అధికారులకు ఈవో సూచించారు. శ్రీవారి ఆలయం, అన్ని కూడళ్లు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని డిప్యూటీ ఈఓను ఆదేశించారు. వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించేందుకు పరిమిత సంఖ్యలో శ్రీవారి సేవకులను ఆహ్వానించాలన్నారు. పారిశుద్ధ్యం చక్కగా ఉండాలని, క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పరిశీలించాలని ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు.


 


అంతకుముందు టిటిడి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబరు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, అక్టోబరు 6న అంకురార్పణ జరుగుతాయని, బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 7న ధ్వజారోహణం, అక్టోబరు 11న గరుడవాహనసేవ నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఏకాంతం కారణంగా అక్టోబరు 12న స్వర్ణ రథం బదులు సర్వభూపాల వాహనాన్ని, అక్టోబరు 14న రథోత్సవం బదులు సర్వభూపాల వాహనాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబరు 15న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగుతాయని తెలిపారు. ఇక ప్రతి ఏడాది లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com