ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2020: ఢిల్లీ - చెన్నై పోరులో జయం ఎవరిది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 25, 2020, 01:17 PM

ఐపీఎల్ 13 లో భాగంగా నేడు దుబాయిలో చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ ‌ తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకూ ఈ రెండు జట్ల మధ్య మొత్తం 21 మ్యాచులు జరగ్గా, 16 మ్యాచుల్లో చెన్నై, 6 మ్యాచుల్లో ఢిల్లీ గెలిచింది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌పై అదిరే విజయం సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ .. రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో అనుకోని పరాభవాన్ని చవిచూసింది. మరోవైపు పంజాబ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో మ్యాచ్ టై అవ్వగా సూపర్ ఓవర్ లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని ఆశిస్తోంది. మరి ఇరు జట్ల బలాబలాలు విశేషాలు తెలుసుకుందాం పదండి.
ఢిల్లీకి బౌలింగ్ రక్ష
ఢిల్లీ జట్టుకు స్పిన్నర్లే అసలైన అండ. పంజాబ్‌ మాజీ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇప్పుడు ఢిల్లీ అమ్ములపొదిలో చేరిపోయాడు. ఐపీఎల్‌లో సూపర్‌రికార్డు కలిగిన అమిత్‌ మిశ్రా, యువ స్పిన్నర్లు సందీప్‌ లామిచెనె, అక్షర్‌ పటేల్‌లు ఢిల్లీ జట్టులో ఉన్నారు. నెమ్మదిగా స్పందించే దుబాయి పిచ్‌పై స్పిన్‌ ప్రభావం ఉండనుంది. పేస్‌ విభాగంలో సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మకు సఫారీ యువ సంచలనం కగిసో రబాడ ప్రమాదకారులు. బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, శ్రేయాష్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, షిమ్రోన్‌ హెట్మయర్‌లతో ఎంతో బలోపేతంగా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో పంత్‌, హెట్మయర్‌, అయ్యర్‌, షా, ధావన్‌లు భారీ లక్ష్యాలను ఛేదించటంలో, భారీ లక్ష్యాలను నిర్దేశించటంలో దిట్ట.
ఆచి తూచి అడుగులు :
ఇప్పటికే ఓ విజయం, మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్‌కింగ్స్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఓపెనర్‌ మురళీ విజరు స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన షేన్‌ వాట్సన్‌ ఆ తర్వాత కొంత తేరుకున్నాడు. అయితే, పూర్తి స్థాయిలో ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదీ. అంబటి రాయుడు, డుప్లెసిస్‌, రవీంద్ర జడేజా, శామ్‌ కరన్‌ సహా కేదార్‌ జాదవ్‌, ఎం.ఎస్‌ ధోనీలు మంచి ఫామ్‌లో ఉన్నారు. లుంగి ఎంగిడి, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లాలతో బౌలింగ్‌ విభాగం మెరుగ్గా కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఐపీఎల్ లో ఆడిన గత మ్యాచులను పోలిస్తే, చెన్నై ముందంజలో ఉన్నమాట నిజమైనప్పటికీ, ఆట వ్యూహాల్లో మరింత పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది.
తుది జట్లు (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్‌ :
శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, శ్రేయాష్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), షిమ్రోన్‌ హెట్మయర్‌, అలెక్స్‌ కేరీ, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, సందీప్‌ లామిచినె, కగిసో రబాడ, ఇషాంత్‌ శర్మ.
చెన్నై సూపర్ కింగ్స్‌ :
షేన్‌ వాట్సన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, శామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లా, లుంగి ఎంగిడి.
టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : ఢిల్లీ క్యాపిటల్స్
కెప్టెన్: శ్రేయాస్ అయ్యర్
యజమాని: జీఎమ్మార్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్
విజేత : -
రన్నరప్ : -
టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : చెన్నై సూపర్‌కింగ్స్‌
కెప్టెన్: ఎంఎస్ ధోని
యజమాని: చెన్నై సూపర్‌కింగ్స్‌ క్రికెట్ లిమిటెడ్
విజేత : 2010, 2011, 2018
రన్నరప్ : 2008, 2012, 2013, 2015, 2019






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com