ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయంగా భారత్ పరపతి మరింత పెరిగిందా?

national |  Suryaa Desk  | Published : Wed, Jun 03, 2020, 04:55 PM

గత కొన్నాళ్లుగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో అంతర్జాతీయంగా భారత్ పరపతి పెరుగుతోన్నట్లు స్పష్టమవుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, శ్రీలంక, మాల్దీవులు, ఇజ్రాయెల్ లాంటి ఎన్నో దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను భారత్ ఎగుమతి చేసింది. ఇది వివిధ దేశాల అధినేతలకు భారత్ పై అభిమానాన్ని మరింత పెంచింది. కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు వారు ప్రధాని మోదీకి, భారతజాతికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్న దేశాధినేతల్లో మోదీ ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో నిలిచారు. సరైన సమయంలో లాక్ డౌన్ ను ప్రకటించడం ద్వారా కరోనా మహమ్మారిని కట్టడి చేసారు. ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.


కరోనా విపత్కర పరిస్థితుల్లో వివిధ దేశాలకు ఆపన్నహస్తం అందించడం తదితర కారణాలతో డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్ధన్ ను వరించింది. కరోనాను భారత్ మాత్రమే సమర్ధంగా ఎదుర్కోగలదని మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరణాల రేటు చాలా తక్కువగా ఉండడం కూడా భారత్ కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటుందనడానికి నిదర్శనం. వైద్యసిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ కరోనాపై భారత్ పోరాటాన్ని అద్వితీయంగా నడిపిస్తున్నారు.


మరోవైపు, G7 దేశాల కూటమిని G10/11 కు పెంచనున్నట్లు ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అందులో భారత్ కు స్థానం లాంఛనమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకోసమే జూన్ లో జరగాల్సిన G7 దేశాల సమావేశాన్ని ట్రంప్ సెప్టెంబర్ కు వాయిదా వీటీషున్నట్లు తెలిపారు. గత కొన్నాళ్లుగా భారత్- అమెరికా మధ్య స్నేహపూరిత సంబంధాలు మరింత పెరిగాయి.


అదేవిధంగా ఈ నెలలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. భారత్ కు ఈ సెక్యూరిటీ కౌన్సిల్ లో తాత్కాలిక సభ్యత్వం కల్పించనున్నారు. కొన్ని సంవత్సరాలుగా భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ ఉంది. దీనికి చాలా దేశాలు తమ మద్దతు ప్రకటించాయి. రానున్న రోజుల్లో ఇది కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలు చైనాపై గుర్రుగా ఉన్నాయి. చైనా నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి దృష్టి భారత్ పై పడింది. విపత్కర పరిస్థితుల్లో సాయం అందించే తత్వం, సమర్ధవంతమైన నాయకత్వం ప్రపంచదేశాలను భారత్ వైపు చూసేలా చేసింది. మేక్ ఇన్ ఇండియాకు మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత రాష్ట్రాలపై కూడా ఉంది. ఇప్పటికే రిలయన్స్ లో పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడుల కేంద్రంగా భారత్ మారనుందన్న అంచనాల నేపథ్యంతో పాటు పైన పేర్కొన్న అంశాల కారణంగా భారత్ పరపతి అంతర్జాతీయంగా మరింత పెరిగిందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com