ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక వీధి కుక్కలకు కూడా ఆధార్ కార్డులు.. కుక్క మెడలో క్యూఆర్ కోడ్

national |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 09:07 PM

ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక దగ్గర అవసరం పడుతోంది. పేరు, ఫోటో, అడ్రస్ ప్రూఫ్‌ల కోసం ఆధార్ కార్డులు ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఈ ఆధార్ కార్డులపై ఉండే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి వివరాలు మొత్తం తెలుస్తాయి. దేశంలోని దాదాపు అందరికీ ఈ ఆధార్ కార్డులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీధి కుక్కలకు కూడా ఆధార్ కార్డులు జారీ చేస్తుండటం తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్కలకు ఆధార్‌కార్డుతోపాటు మెడలో క్యూఆర్ కోడ్‌ను కూడా ఉంచుతున్నారు. దీంతో ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ కుక్కకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారు.


అయితే మన దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలకు ఆధార్ కార్డ్‌లు అందిస్తున్నారు. ఇప్పటికే 100 వీధి కుక్కలకు ఈ ఆధార్ కార్డులను జారీ చేశారు. అయితే ఆ ఆధార్ కార్డులను ఇచ్చేది ప్రభుత్వం మాత్రం కాదు. ఒక స్వచ్చంధ సంస్థ కుక్కలకు ఆధార్ కార్డులను జారీ చేస్తోంది. ఢిల్లీకి చెందిన పాఫ్రెండ్ డాట్ ఇన్ అనే ఎన్జీఓ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ టర్మినల్ ఎయిర్‌పోర్టు, ఇండియా గేట్ సహా ఎన్సీఆర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వీధి కుక్కలకు ఈ ఆధార్ కార్డులను ఆ స్వచ్ఛంద సంస్థ జారీ చేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 27 వ తేదీన స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించిన ఎన్జీఓ.. కుక్కల మెడలో క్యూఆర్ కార్డులు వేశారు.


ఇక యానిమల్ యాక్టివిస్ట్ మానవి రవి ఈ కుక్కల ఆధార్ కార్డుల కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు. వీధి కుక్కలకు ఈ ఆధార్ కార్డులు ఒక లైఫ్‌లైన్ అని ఆమె వెల్లడించారు. కుక్కల మెడలో వేసే ఆ ట్యాగ్స్‌పై క్యూఆర్ కోడ్ ఉంటుందని పేర్కొన్నారు. అందులో మైక్రోచిప్‌ ఉంటుందని.. ఆ ట్యాగ్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను ఎవరైనా స్కాన్ చేస్తే ఆ కుక్కకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుందని వివరించారు. అంటే ఆ కుక్క ఏ వీధికి చెందింది.. దానికి ఎవరు రోజూ ఆహారం పెడతారు.. వారికి సంబంధించిన వివరాలు అందులో తెలుస్తుంది. కుక్కలు తప్పిపోయినపుడు గానీ, ప్రమాదంలో ఉన్నపుడు గానీ, గాయపడినపుడు గానీ ఈ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఎన్జీఓ నేతలు చెబుతున్నారు. కుక్కలు ఎక్కడైనా తప్పిపోయినపుడు వాటిని ట్రాక్ చేసేందుకు కూడా ఈ ఆధార్ కార్డులు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com