ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలసంరక్షణపై అవగాహనకు కృషి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2017, 01:46 AM

 -ప్రాజెక్టులు పూర్తరుుతే 26 లక్షల ఎకరాలకు నీరు


 -ఇలాంటి ప్రతిపక్షాన్ని ఇన్నేళ్లలో చూడలేదు


 -తన పేరు శాశ్వతమవ్వాలనే కష్టపడుతున్నా


 -గౌరవం నిలుపుకునేలా స్వీయ క్రమశిక్షణ


 -ప్రజా సేవ తప్ప మరో ధ్యాస లేదు


 -ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


(అమరావతి-సూర్య ప్రధాన ప్రతినిధి) జలసంరక్షణపై ప్రజల్లో అవగాహన తెస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం వెలగపూడి అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యర్థ జలాల వల్ల కాలుష్యం ప్రబలుతోందని, సింగపూర్‌లో వ్యర్థజలాలను శుద్ధి చేసి తాగునీటికి వాడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టులు పూర్తయితే 26 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, కాంగ్రెస్‌ హయాంలో నిధులు ఖర్చు చేసినా ప్రాధాన్యత ప్రకారం పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం దశలవారీగా పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, కరువులో తక్కువ నీటితో మెరుగైన ఫలితాలు సాధించామని, వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో రాష్ట్రానికి అవార్డు వచ్చిందని, డిసెంబర్‌ నాటికి వంశధార ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని, గేట్లు, స్పిల్‌వే పనులు ప్రారంభమయ్యాయని వివరించారు.


40 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదు : తన 40 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం వరల్డ్‌ వాటర్‌ డే సందర్బంగా అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. అయితే సీఎం ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డుపడుతూ తమ నిరసనలను తెలుపుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు.


హైదరాబాద్‌లో తన అభివృద్ధే కనిపిస్తోంది : హైదరాబాద్‌లో ఏమూలకు వెళ్లినా తాను చేసిన అభివృద్ధే కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నవ్యాం ధ్రను కూడా అలాగే అభివృద్ధి చేయాలన్నదే తన తపన అన్నారు. తన పేరు శాశ్వతంగా గుర్తుండాలనే కష్టపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. గౌరవం నిలుపుకునేందుకు స్వీయ క్రమశిక్షణ పాటిస్తున్నానని, ఒకే విషయాన్ని పదేపదే చెబితే ప్రజలు నమ్ముతారని జగన్‌ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. 11 ఛార్జ్‌షీట్లలో నిందితుడిగా ఉండి 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.


రాజకీయాల్లో ఎంతో అరుదైన అవకాశం : రాజకీయాల్లో తనకు అరుదైన అవకాశం దక్కిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధానిని ఎంపిక చేసే అవకాశం కూడా తనకు దక్కిందని, దీనికి చాలా సంతోషంగా ఉందని ఆయన ఏపీ అసెంబ్లీ మాట్లాడారు. సుదీర్ఘకాలం సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్నానని ఆయన చెప్పారు. ప్రజాసేవ తప్ప తనకు మరో ధ్యాస లేదన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా ప్రకటిస్తున్నానని వెల్లడించారు.


పెళ్లి చేసుకోమని ఎన్టీఆరే అడిగారు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాజకీయాల్లో తన ఎదుగుదలను చూసిన ఎన్టీఆర్‌ స్వయంగా వచ్చి తన కూతురిని పెళ్లి చేసుకోమని అడిగారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతను కూడా చూసుకుంటానన్నారు. రాజకీయాలతో కుటుంబం ఆధారపడుకూడదని ఒక నిర్ణయం తీసుకున్నానని, దాని కోసమే 25 సంవత్సరాల క్రితం డెయిరీ పెట్టి, రాజకీయాలతో పాటు వ్యాపారాన్ని కూడా చూసుకునేవాడినని చంద్రబాబు తెలిపారు. వ్యాపారం ప్రారంభించిన తర్వాత రెండు సంవత్సరాల పాటు అసెంబ్లీ అయిపోయిన తర్వాత, పార్టీ పనులు చూసుకుంటూ వ్యాపారానికి కూడా ఒక గంట సమయం కేటాయించేవాడినని బాబు వెల్లడించారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత వ్యాపార బాధ్యతను తన భార్యకు అప్పగించానన్నారు. 24 సంవత్సరాలుగా వ్యాపారాన్ని తన భార్యే చేసుకుంటున్నారని, ఇంట్లో ఎవరికి అభద్రతా భావం లేదని ఆయన వివరించారు.


జలదినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యేల ప్రతిజ్ఞ : ప్రపంచ జలదినోత్సవం సందర్బంగా బుధవారం అసెంబ్లీలో శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రతిజ్ఞ చేయించారు. జల సంరక్షణకు కట్టు బడి ఉంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. కాగా వైసీసీ ఎమ్మెల్యేలు ప్రతిజ్ఞ చేయకుండానే బయటకు వెళ్లారు. 40ఏళ్ల చరిత్రలో ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడలేదని, ప్రతిజ్ఞ చేయాల్సి వస్తుందనే కారణంగా అసెంబ్లీ నుంచి ప్రతిపక్షం వెళ్లిపోవడం దారుణమన్నారు. 


వచ్చే ఎన్నికల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి : తెలుగుదేశం పార్టీ భారతీయ జనతాపార్టీతో కలిసి సమన్వయంతో పనిచేస్తే అన్ని ఎన్నికల్లోనూ తమదే విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాధవ్‌ గెలుపొందడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని నేతలకు సూచించారు. విశాఖ కార్పోరేషన్‌ ఎన్నికల్లోనూ ఇదే సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com