ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజ్వల్ రేవన్న ప్రైవేటు వీడియోలు 4, 5 ఏళ్ల కిందటివి.. తండ్రి హెచ్‌డీ రేవన్న వెల్లడి

national |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 10:04 PM

సార్వత్రిక ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని మనవడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రైవేటు వీడియోల వ్యవహారం కన్నడనాట తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్.. ఈ వ్యవహారంపై సిట్ విచారణ జరుపుతోంది. ఇక ఈ వీడియోల వ్యవహారం బయటికి రావడంతో ఎంపీ ప్రజ్వాల్ రేవన్న.. విదేశాలకు పారిపోవడం మరింత దుమారానికి కారణం అయింది. ఈ వ్యవహారంపై తాజాగా ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, కర్ణాటక ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ స్పందించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు ఇప్పటివి కావని.. అవి 4, 5 ఏళ్ల క్రితం వీడియోలు అని వెల్లడించారు. ఇక ఎన్నికల వేళ ఈ వీడియోల వ్యవహారం వెలుగుచూడటంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ-జేడీఎస్ కూటమి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తోంది.


ఈ కేసులో ప్రజ్వల్ రేవన్న సహా ఆయన తండ్రి హెచ్‌డీ రేవన్నపైనా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్‌ పోలీసులు వారిద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇక ఆ ఫిర్యాదు చేసిన మహిళ.. వారి బంధువే కావడం గమనార్హం. ఈ కేసుపై స్పందించిన హెచ్‌డీ రేవన్న.. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర అని ఆరోపించారు. ఇక ఆ వీడియోలు నాలుగైదు ఏళ్ల క్రితం నాటివి అని తెలిపారు. మరోవైపు.. ఇలాంటి ఒక కుట్ర జరుగుతుందని తనకు ముందే తెలుసని.. అలాంటి కుట్రలకు భయపడి తాను పారిపోయేవాడిని కాదని పేర్కొన్నారు.


తమ కుటుంబానికి వ్యతిరేకంగా వైరల్ అవుతున్న వీడియోలు 4, 5 ఏళ్ల కిందటివని చెప్పారు. ప్రస్తుతం ప్రజ్వల్‌ రేవణ్ణ.. విదేశాలకు వెళ్లాడని.. ఈ ఎఫ్ఐఆర్ గురించి తనకు తెలియదని హెచ్‌డీ రేవన్న తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకుని.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్‌ వంటి అనేక విచారణలు తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని స్పష్టం చేశారు.


మరోవైపు.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వాల్‌ రేవన్న.. దేశం విడిచిపెట్టి జర్మనీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ కేసుపై సిట్‌ బృందం విచారణ వేగవంతం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com